అసలే కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క పెట్టుకునే పరిస్థితుల్లో జీవితాలు ఉంటే, కాదేది దోపిడికి అనర్హం అనే రీతిలో కొందరి దందా సాగుతుంది. పెట్రోల్ బంకుల్లో తక్కువ పెట్రోలు వచ్చేలా ఎలక్ట్రానిక్ చిప్ లు అమర్చి మోసాలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో దానిపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం ఫిర్యాదులు అందిన బంక్ లను గుర్తించి లీగల్ మెట్రాలజీ విభాగం వారు విస్తృతంగా దాడులు చేశారు. వాహనదారులకు అనుమానం రాకుండా పెట్రోల్ బంక్ యజమానులు కొంతమందితో కలిసి ఈ ఘరానా మోసానికి పాల్పడుతున్నారు.
పశ్చిమ గోదావరిలో 7 పెట్రోల్ బంకుల్లో ఈచిప్ లు అమర్చి నట్టుగా అధికారులు తెలిపారు. తెలంగాణలో 14, ఏపీలో 24 పెట్రోల్ బంకుల్లో చిప్ లు పెట్టినట్టు వెల్లడించారు. తక్కువ పెట్రోలు వచ్చేలా చిప్ లు ఏర్పాటుచేసిన బంక్ యాజమాన్యం నాగులపాడు మండలం అమ్మనుబ్రోలు ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్లో ప్రత్యేక చిప్ లు అమర్చి మోసాలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించి చిప్ లను సీజ్ చేశారు. కృష్ణ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తనిఖీలు చేశారు. అలానే విజయవాడ ఏలూరు రోడ్డులో తనిఖీ చేయగా, కొలతల్లో తేడాలు గుర్తించారు. ప్రకాశం జిల్లాలోనూ అధికారులు రీడింగ్ చెక్ చేశారు అక్కడ కూడా కొలతల్లో తేడాలు రావడం తో బంక్ యజమానులను అధికారులు ప్రశ్నించారు. పోలీసులు కొంత మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. బంకుల్లో ఇచ్చే అమౌంట్ కు తక్కువ పెట్రోల్ వచ్చేలా ఎలక్ట్రానిక్ చిప్ లను అమరుస్తున్నారని అధికారులు తెలిపారు.
