iBomma Warning: మీరు మాపై ఫోకస్ చేస్తే, మేము మీపై చేస్తాం.. పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన iBomma
iBomma Warning: “తెలుగు సినీ పరిశ్రమను వందల కోట్ల రూపాయల నష్టంలోకి నెడుతున్న పైరసీ వెబ్‌సైట్ ఐ బొమ్మ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తాజాగా, ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు హైదరాబాద్ పోలీసులను ఉద్దేశిస్తూ పరోక్షంగా బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ ఏడాదిలోనే తెలుగు సినిమా పరిశ్రమ దాదాపు రూ. 3,700 కోట్ల నష్టాన్ని చవిచూసిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించిన నేపథ్యంలో, ఐ బొమ్మతో సహా 65కి పైగా పైరసీ వెబ్‌సైట్‌లపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురు పైరసీ నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, పైరసీ వెబ్‌సైట్‌లను ట్రాక్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే, పోలీసుల హెచ్చరికలపై ఐ బొమ్మ వెబ్‌సైట్ స్పందించింది. తమపై పోలీసులు దృష్టి సారిస్తే, తాము కూడా పోలీసుల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఒక లేఖ ద్వారా కౌంటర్ ఇచ్చింది. ఈ లేఖలో పైరసీకి తమ కారణాలను కూడా వివరించింది.
సినిమా బడ్జెట్ ఎక్కువగా హీరోలు, హీరోయిన్ల పారితోషికాలకే ఖర్చవుతోందని, ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నారని ఐ బొమ్మ ఆరోపించింది. సినిమా పరిశ్రమలోని సాధారణ కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ, అగ్ర నటులకు అధిక రెమ్యూనరేషన్లు ఇస్తున్నారని పేర్కొంది. విదేశాల్లో షూటింగ్‌లు చేయడం వల్ల బడ్జెట్ పెరిగి ఆ భారం ప్రజలపై పడుతోందని, ఈ కారణాలవల్లే తాము పైరసీకి పాల్పడుతున్నామని సమర్థించుకుంది.
పోలీసుల హెచ్చరికలకు ఐ బొమ్మ టీమ్ బెదిరింపు లేఖతో బదులివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ సవాళ్ళపై హైదరాబాద్ పోలీసులు ఎలా స్పందిస్తారో, పైరసీ అక్రమాలను ఎలా అరికడతారో వేచి చూడాలి.

