Prabhas Pawan Kalyan: ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్.. టాప్ 10లో దక్షిణాది హీరోలదే హవా..!
Prabhas Pawan Kalyan: ప్రతి నెలా దేశవ్యాప్తంగా సినిమాలకు సంబంధించి వివిధ సర్వేలు నిర్వహించే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ మీడియా, జూలై 2025 నెలకి సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభాస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తుండటం విశేషం. ఏకంగా బాలీవుడ్ ప్రముఖులను కూడా వెనక్కి నెట్టి ఆయన ఈ స్థానంలో కొనసాగుతున్నారు.
ప్రభాస్ సినిమాలు చేస్తున్నా, చేయకపోయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ఈ మధ్యే విడుదలైన మంచు విష్ణు సినిమా ‘కన్నప్ప’లో ప్రభాస్ ‘రుద్ర’ అనే కీలక పాత్రలో కనిపించి సినిమాపై అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు, ‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.
టాప్ 10 జాబితాలో దక్షిణాది హీరోల డామినేషన్
ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన జాబితాలో టాప్ 10లో ఏకంగా ఎనిమిది మంది దక్షిణాది హీరోలు ఉండటం గమనార్హం. కేవలం ఇద్దరు బాలీవుడ్ హీరోలు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇది భారతీయ సినీ పరిశ్రమలో దక్షిణాది చిత్రాల పెరుగుతున్న ప్రభావాన్ని, ప్రజాదరణను సూచిస్తుంది.
టాప్ 10 జాబితా ఇదే..
1. ప్రభాస్
2. ఇళయ దళపతి విజయ్
3. షారుఖ్ ఖాన్
4. అల్లు అర్జున్
5. అజిత్ కుమార్
6. మహేష్ బాబు
7. జూనియర్ ఎన్టీఆర్
8. రామ్ చరణ్
9. సల్మాన్ ఖాన్
10. పవర్ స్టార్ పవన్ కల్యాణ్
జూన్ నెలలో 10వ స్థానంలో ఉన్న న్యాచురల్ స్టార్ నాని, జూలై నెలలో ఆ స్థానాన్ని కోల్పోగా, పవన్ కల్యాణ్ ఈ జాబితాలో తిరిగి చోటు సంపాదించుకున్నారు. ఇది ఆయన అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.
