Prashanth Neel: “పాన్ ఇండియా రోడ్డుకు హైవే వేసిన కాంట్రాక్టర్ రాజమౌళి”..!
Prashanth Neel: భారతీయ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ చిత్రం పదేళ్ల తర్వాత ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రీ-రిలీజై మరోసారి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఈ ప్రత్యేక ప్రదర్శనను వీక్షించిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ (KGF ఫేమ్) ఈ సినిమాపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చి, రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపించారు.
ప్రశాంత్ నీల్ భార్య లిఖిత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఆసక్తికరమైన రివ్యూను ఒక చిన్న కథ రూపంలో పంచుకున్నారు. “ఒక రోడ్డు సరిగా లేకపోతే దానికి మరమ్మతులు చేయాలని అందరూ కలిసి ఒక కాంట్రాక్టర్‌ను పిలిచారు. ఆ కాంట్రాక్టర్ కేవలం రోడ్డును బాగు చేయడమే కాకుండా, ఏకంగా దాన్ని 16 వరుసల హైవేగా మార్చేశాడు. ఆ రోడ్డు మరేదో కాదు పాన్ ఇండియా. ఆ కాంట్రాక్టర్ మరెవరో కాదు దర్శకధీరుడు రాజమౌళి!” అంటూ నీల్, రాజమౌళి టాలెంట్‌ను అభినందించారు. ఒక తరం సినీ నిర్మాతల కోసం ‘బాహుబలి’ టీమ్ గొప్ప కలలు కన్నదని కొనియాడుతూ, యావత్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
నిజానికి ‘బాహుబలి ది ఎపిక్’ అనేది మొదటి రెండు భాగాలైన ‘బాహుబలి: ది బిగినింగ్’ మరియు ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ చిత్రాలను కలిపి, తొంభై నిమిషాల కంటే ఎక్కువ సన్నివేశాలను తొలగించి, ఒకే పార్ట్‌గా విడుదల చేశారు. ఈ క్రమంలో అవంతిక లవ్‌స్టోరీ, పచ్చబొట్టేసిన పాట, ఇరుక్కుపో సాంగ్, కన్నా నిదురించరా వంటి పాటలతో పాటు కొన్ని యుద్ధ సన్నివేశాలను కూడా తొలగించారు.
ఇంత భారీగా కత్తిరింపులు చేసినప్పటికీ, కథాంశంలో ఎక్కడా లోపం కనిపించకుండా, సినిమాటిక్ ఫ్లో దెబ్బతినకుండా రాజమౌళి తన మార్క్‌ను చూపించారని ప్రేక్షకులు మరియు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘బాహుబలి: ది ఎపిక్’ చిత్రం రీ-రిలీజ్లోనూ పదేళ్ల క్రితం నాటి థ్రిల్‌ను అనుభూతి చెందుతూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
