Priyanka Amir: హీరోలకు ఇచ్చిన దాంట్లో హీరోయిన్లకు 10 శాతం కూడా ఇవ్వరు..!
Priyanka Amir: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ఉన్న అసమానతలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హీరోలు, హీరోయిన్ల మధ్య పారితోషికాల విషయంలో ఉన్న వ్యత్యాసం, మగవారి ఆధిపత్యం గురించి ఆమె మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరోయిన్లకు తక్కువ ఎందుకు..?
ప్రియాంక మాట్లాడుతూ, “బాలీవుడ్‌లో పురుషాధిక్యత ఎక్కువగా ఉంది. మేము హీరోల కంటే ఏ మాత్రం తక్కువ కాదు. వారు ఎంత కష్టపడతారో, మేము కూడా అంతే కష్టపడతాం. కానీ మా పారితోషికం వారికి ఇచ్చే దానిలో పదో వంతు కూడా ఉండదు. అంతేకాకుండా, షాట్‌కు ఎప్పుడు రావాలో హీరో నిర్ణయిస్తాడు. మేము గంటల తరబడి ఎదురుచూస్తూ ఉండాలి. హాలీవుడ్‌లో ఈ పరిస్థితి లేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, తన కెరీర్ మొదట్లో రంగు విషయంలో కూడా విమర్శలు ఎదుర్కొన్నానని, అది అవకాశాలపై ప్రభావం చూపిందని ప్రియాంక గుర్తు చేసుకున్నారు.
ఆమిర్ ఖాన్ సమాధానం ఏంటంటే..?
ఇదిలా ఉండగా, పదేళ్ల క్రితం ఇదే అంశంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రియాంక ప్రశ్నకు సరైన సమాధానం అంటూ ఆమిర్ ఖాన్ పాత వీడియో బైట్‌ను ఇప్పుడు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, రాణి ముఖర్జీలతో కలిసి నటించిన ‘తలాష్’ సినిమా ప్రమోషన్ల సమయంలో ఈ విషయంపై ఆమిర్ స్పందించారు. నటీనటుల మధ్య పారితోషిక వ్యత్యాసానికి స్త్రీ, పురుష భేదం కారణం కాదని, మార్కెట్‌లో వారికి ఉన్న విలువ, సినిమాకు లాభాలు తెచ్చే సామర్థ్యంపైనే అది ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. “సినిమాకు లాభాలు తెచ్చే శక్తి ఎవరికి ఉంటే, వారికి ఆ మేరకు పారితోషికం లభిస్తుంది. ఇది స్త్రీ, పురుష భేదం వల్ల కాదు” అని ఆమిర్ స్పష్టం చేశారు.
ప్రియాంక, ఆమిర్‌ల భిన్నమైన అభిప్రాయాలు బాలీవుడ్‌లో పారితోషికాల అసమానతపై మరోసారి చర్చకు తెర లేపాయి. ఈ సమస్యపై వారిద్దరిలో ఎవరి వాదన సరైందనేది సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది.
