R Madhavan: కశ్మీర్‌లో చిక్కుకుపోయిన మాధవన్.. లేహ్‌కు వెళ్లిన ప్రతీసారి ఇలానే జరుగుతోందని పోస్టు
R Madhavan: బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిక్కుకుపోయారు. ఈ పరిస్థితి తనకి కొత్తేమీ కాదని, సరిగ్గా 17 ఏళ్ల క్రితం కూడా ఇలాగే చిక్కుకున్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వాయిస్ నోట్‌ను పోస్ట్ చేస్తూ తన ప్రస్తుత పరిస్థితిని వివరించారు.
“నేను షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి విపరీతంగా వర్షం కురుస్తోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల విమానాశ్రయాలు మూతబడ్డాయి. దీంతో నేను లేహ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. గతంలో, 2008లో ‘త్రీ ఇడియట్స్’ (3 Idiots) షూటింగ్ కోసం వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. అప్పుడు కూడా అకస్మాత్తుగా మంచు కురవడంతో మా బృందం మొత్తం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ప్రాంతం ఎలా ఉన్నప్పటికీ ఎంతో అందంగా ఉంటుంది” అని మాధవన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
“ఈరోజు వర్షం తగ్గి, విమానాలు బయలుదేరి నేను ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుకు “17 సంవత్సరాల తర్వాత మరోసారి లేహ్‌లో చిక్కుకున్నా” అని క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవల ‘ఆప్ జైసా కోయి’ సినిమాతో అలరించిన మాధవన్ ప్రస్తుతం ‘ధురంధర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఆదిత్యధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
