Rajini-Kamal: రజనీకాంత్ – కమల్‌హాసన్ సినిమాకు దర్శకుడు దొరికాడు.. ఎవరంటే?
Rajini-Kamal: దక్షిణాది సినీ పరిశ్రమలో రెండు దిగ్గజాలు, అగ్ర నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ కలయికలో సినిమా ఖరారు కావడంపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. వీరిద్దరి స్నేహం, సోదర బంధానికి ప్రతీకగా నిలిచే ఈ సినిమాకు సంబంధించిన కీలక వివరాలను నిర్మాత కమల్‌హాసన్ తాజాగా వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.
రజనీకాంత్, కమల్‌హాసన్ కలయికలో సినిమా ఖరారైనప్పటి నుంచి దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. మొదట్లో లోకేశ్ కనగరాజ్ సహా పలువురు యువ దర్శకుల పేర్లు వినిపించినా, ఆ అవకాశం సీనియర్ దర్శకుడు సుందర్.సి సొంతం చేసుకున్నారు. రజనీకాంత్‌కు ఇది 173వ చిత్రం కాగా, గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరుణాచలం’ తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న సినిమా ఇది. దీంతో సుందర్.సి ఎలాంటి కథను ఎంచుకున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రాన్ని కమల్‌హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై, ఆర్.మహేంద్రన్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ, “మా ఇద్దరి మధ్య ఉన్న ఐదు దశాబ్దాల స్నేహం, సోదర బంధానికి ఈ సినిమా ఒక గొప్ప వేడుకలాంటిది” అని పేర్కొన్నారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మైలురాయిగా మారుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమాలో కమల్‌హాసన్ కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారా, లేక రజనీకాంత్‌తో పాటు ఒక ముఖ్య పాత్రలో నటిస్తారా అనే విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఏదేమైనా, ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్ట్ సినీ అభిమానులకు ఒక కనుల పండుగలా ఉండనుంది.
