Ravi Teja: మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం ఫిక్స్.. గెస్ట్‌గా సూర్య
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు నిజంగా ఇది పండగ వాతావరణమే. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధమవుతుండగా, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఒక సంచలన ప్రకటన విడుదలైంది.
రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతున్న ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 28 రోజున హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ భారీ వేడుక జరగనుంది. ఒకే వేదికపై రవితేజ ఎనర్జీ, సూర్య క్లాస్ ప్రెజెన్స్ చూడబోతుండడంతో ప్రేక్షకులు, ఫ్యాన్స్ ‘మాస్ మీట్స్ క్లాస్’ అంటూ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే అభిమానుల కోరిక మేరకు ఒక రోజు ముందుగానే (అక్టోబర్ 30న రాత్రి) ప్రీమియర్స్ వేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో ‘సామజవరగమన’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
‘ధమాకా’ వంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన రవితేజ-శ్రీలీల-భీమ్స్ సిసిరోలియో కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ‘మాస్ జాతర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూర్య హాజరు కావడం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఈ సినిమాకు మరింత ప్రచారం లభించేలా చేయనుంది.
