Ravi Teja: ‘ఆ మేధావులు థియేటర్లకు రారు’.. రొటీన్ సినిమాల విమర్శలపై మాస్ మహారాజా రవితేజ కౌంటర్
Ravi Teja: టాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అడుగుపెట్టి, తనదైన మ్యానరిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌తో మాస్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరో రవితేజ. క్లాస్, మాస్, యాక్షన్, కామెడీ… జోనర్ ఏదైనా అందులో రవితేజ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పనిసరిగా కనిపిస్తాయి. అయితే ఒకానొక దశలో సరైన విజయాలు లేక డీలా పడ్డ ఆయన, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘క్రాక్’ సినిమాతో మళ్లీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి, సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు.
అయితే ఇటీవల కాలంలో రవితేజ సినిమాలు ఒకే పంథాలో, రొటీన్‌గా ఉంటున్నాయంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్ లో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్ మహారాజా రవితేజ తాజాగా చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
ట్విటర్ ఎప్పుడూ నెగెటివిటీతో నిండి ఉంటుందని గతంలో వ్యాఖ్యానించిన రవితేజ, తాజాగా మరోసారి సోషల్ మీడియా విమర్శకులపై గట్టిగా స్పందించారు. “ఈ ట్విటర్ మేధావులు థియేటర్లకు అస్సలు వెళ్లరు” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “జనాలు నన్ను ‘గీతాంజలి’ లాంటి సినిమాల్లో చూడరు. నేను నిజాయితీగా ప్రయత్నించినప్పుడల్లా ఆ సినిమాలను ప్రోత్సహించలేదు” అని రవితేజ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాము ఏం చేసినా సరే, ఆ ట్విటర్ జనాలు కామెంట్స్ చేస్తూనే ఉంటారని రవితేజ అన్నారు. “నేను ఒకే రకమైన సినిమాలు చేస్తున్నానని వారు చెబుతున్నారు. కానీ జనాలు మాత్రం కమర్షియల్ సినిమాలను గమనిస్తున్నారు. కమర్షియల్ సినిమాలు చేయడం అంత సులభమేమీ కాదు. దీనికి సరైన కొలమానం కావాలి” అని ఆయన చెప్పుకొచ్చారు. కోవిడ్ సంక్షోభం తర్వాత ఓటీటీ కంటెంట్‌కు అలవాటు పడిన కొంతమంది జనాల మైండ్‌సెట్ మారిందని, అయితే వారిలో కొంతమంది థియేటర్లకు మాత్రం రారని రవితేజ అభిప్రాయపడ్డారు. రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.
