Siva: ‘శివ’ మూవీలో మోహన్‌బాబును వద్దన్నందుకే గెలుపు సాధ్యమైంది: ఆర్జీవీ
Siva: తెలుగు చలనచిత్ర చరిత్రలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన చిత్రం ‘శివ’. అక్కినేని నాగార్జున హీరోగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, అప్పటివరకు ఉన్న సాంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి, రియలిస్టిక్ యాక్షన్, కొత్త టేకింగ్‌తో ఇండస్ట్రీని మలుపు తిప్పింది. ఈ క్లాసిక్ సినిమా ఇప్పుడు అత్యాధునిక 4K క్వాలిటీతో నవంబర్ 14న మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
ఈ రీ-రిలీజ్ సందర్భంగా, సినిమా వెనుక జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘శివ’ చిత్రంలో విలన్ రఘువరన్ దగ్గర పనిచేసే రౌడీ గణేష్ పాత్ర కోసం నిర్మాత అక్కినేని వెంకట్ ప్రముఖ నటుడు మోహన్ బాబు పేరును సూచించారట. హీరోకు వార్నింగ్ ఇచ్చే కీలక సన్నివేశంలో, ప్రేక్షకులకు తెలిసిన ఒక స్టార్ నటుడు ఉంటే ఆ సీన్ మరింత బలంగా, పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఆయన భావించారు.
అయితే దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం ఈ సూచనను వెంటనే తిరస్కరించారట. అందుకు గల కారణాన్ని కూడా ఆయన స్పష్టంగా వివరించారని తెలుస్తోంది. వర్మ అభిప్రాయం ప్రకారం, “మోహన్ బాబు గారు తెలుగు ప్రేక్షకులకు ఒక ఫ్యామిలీమ్యాన్‌గా సుపరిచితులు. ఆయన డైలాగ్ డెలివరీకి, బాడీ లాంగ్వేజ్‌కి ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అలాంటి స్టార్ నటుడు రౌడీ పాత్రలో కనిపిస్తే, ప్రేక్షకులు ఆ పాత్రలోని క్రూరత్వాన్ని లేదా భయాన్ని అనుభవించలేరు. బదులుగా వారు ఆ సీన్లో మోహన్ బాబునే చూస్తారు.”
ఈ కారణంతోనే, ఆ పాత్రలోని రియలిస్టిక్ క్రూరత్వం కోసం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కొత్త వ్యక్తి అయిన విశ్వనాథ్‌ను ఎంపిక చేశారట. వర్మ తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో ‘శివ’ సినిమాలో రియలిజం పెరగడానికి, ఆ పాత్ర ప్రభావం ప్రేక్షకులకు బలంగా చేరడానికి దోహదపడింది. ఈ విషయంలో వర్మ విజయం సాధించారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
