Rishab Shetty: ‘కాంతార 1’లో మాయావి పాత్ర చేసింది రిషబ్ శెట్టే.. 6 గంటల మేకప్‌తో డెడికేషన్
Rishab Shetty: దర్శకత్వం, నటనలో తనదైన ముద్ర వేసిన నటుడు రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆయన స్వీయ దర్శకత్వంలో, కథానాయకుడిగా రూపొందిన ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రంలో రిషబ్ పోషించిన బెర్మే పాత్ర చూపిన ప్రభావం ప్రేక్షకులను, సినీ ప్రముఖులను మంత్రముగ్ధులను చేసింది. ‘ఆ పాత్రను రిషబ్ తప్ప మరెవరూ చేయలేరు’ అని అంతా ముక్తకంఠంతో ప్రశంసించారు. అయితే, సినిమా ప్రారంభంలో, మధ్యలో, క్లైమాక్స్‌లో కనిపించే రహస్య పాత్ర ‘మాయావి’ ఎవరు పోషించారు? అనే సందేహానికి తెరదించుతూ, తాజాగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ కీలక ప్రకటన చేసింది.
ఆ మాయావి పాత్రలో నటించింది కూడా రిషబ్ శెట్టే అని హోంబలే ఫిలిమ్స్ అధికారికంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను కూడా వారు విడుదల చేశారు. ఈ వీడియోలో రిషబ్ శెట్టి మాయావి పాత్ర కోసం మేకప్ చేసుకునే కష్టతరమైన ప్రక్రియను చూపించారు.
రిషబ్ శెట్టి మాయావి పాత్ర కోసం చూపిన డెడికేషన్ చూసి సినీ ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు అబ్బురపడుతున్నారు. హోంబలే ఫిలిమ్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మాయావి పాత్ర మేకప్ కోసం రిషబ్‌కు ప్రతిసారి దాదాపు 6 గంటల సమయం పట్టిందట. తెల్లవారుజామున ఆరు గంటలకే రిషబ్ షూటింగ్ స్పాట్‌కు చేరుకుని, ఉదయం తొమ్మిది గంటల వరకు కదలకుండా కూర్చొని ఆ సుదీర్ఘ మేకప్‌ను చేయించుకున్నారు. ఈ వీడియోలో ఆయన చూపించిన సహనం, నిబద్ధత చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలో రిషబ్ ఒకేసారి బెర్మే, మాయావి అనే రెండు విభిన్న పాత్రలు పోషించడం, ఆ రెండు పాత్రల మధ్య తేడాను అద్భుతంగా ప్రదర్శించడం పట్ల విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఈ స్థాయి నటనకు రిషబ్‌కు మరోసారి జాతీయ అవార్డు రావడం ఖాయం” అని పలువురు సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
