తెలుగులో చాలా చిత్రాల్లో ముందు అనుకున్న నటీనటుల స్థానంలో వేరే నటులను తీసుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. ఆ చిత్రాలు ఒక్కోసారి ఊహించని విజయం సాధించి ఈ క్యారెక్టర్ ని మేము ఎందుకు మిస్ చేసుకున్నామో అని నటులు బాధపడుతుంటారు. అలా కాకుండా ఇంకోసారి ముందుగా అనుకున్న నటులను బడ్జెట్ పరంగా, పరభాషానువాదం చేసే ఆలోచనతో పక్కకు పెడుతుంటారు.
సన్నాఫ్ సత్యమూర్తి సినిమా విషయంలో అదే జరిగింది. అల్లు అర్జున్ హీరోగా కన్నడ సూపర్ స్టార్ ఉప్పి అని అభిమానులు పిలుచుకునే ఉపేంద్ర కీలక పాత్రలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముందుగా తెలుగులో ఫేమ్ కోల్పోయి అప్పటికే ప్లాపుల్లో ఉన్న ఒక హీరోని అనుకున్నారు.
కానీ అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా మలయాళంలో సూపర్ స్టార్ లకు తగిన రీతిలో కలెక్షన్లను తెచ్చే స్టామినా కలిగిన హీరో. తను నటించే చిత్రాలు తెలుగు మలయాళం మాత్రమే కాకుండా కన్నడ, తమిళం భాషల్లో విడుదల చేసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కథల ఎంపిక నటీనటుల ఎంపిక చేయాల్సిందిగా తన దర్శకులకు సూచిస్తూ ఉంటాడు.
అలా ఇతర భాషల మార్కెట్ దృష్టిలో పెట్టుకొని తెలుగులో అనుకున్న ఆ హీరో ని పక్కనపెట్టి ఉపేంద్రను తీసుకోవడం జరిగింది. తెలుగులో ముందుగా అనుకున్న ఆ హీరో మరెవరో కాదు యాంగ్రీ యంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్. ఈ విషయం ఒక యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ స్వయంగా తెలిపారు. గరుడవేగ చిత్రం హిట్ అయిన తర్వాత తను ఇంతకు ముందు పాత్రల ఎంపికలో కొన్ని కొన్ని తప్పులు చేశాను అని, ఇకపై అలాంటివి జరగకుండా జాగ్రత్త పడతానని, ఇకపై హీరోగానే కాకుండా విలన్ క్యారెక్టర్లు, సినిమాలో ముఖ్యమైన పాత్రలను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.