Samantha Diwali: చిన్నారులతో సమంత దీపావళి వేడుకలు.. 11 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రత్యూష ఫౌండేషన్
Samantha Diwali: స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితమైనా, వృత్తిపరమైన అప్‌డేట్‌లైనా.. ఏదైనా సరే సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటుంది. అయితే, తాజాగా ఆమె చేసిన ఒక పని అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రశంసలు అందుకుంటోంది. తాను స్థాపించిన ‘ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో సమంత, చిన్నారులతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సమాజ సేవ కోసం సమంత ఏర్పాటు చేసిన ‘ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్’ ద్వారా పేద, అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు, మహిళలకు నిరంతరం సాయం అందుతున్న విషయం తెలిసిందే. ఈ ఫౌండేషన్ ఈ ఏడాది అద్భుతంగా పదేళ్లు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ‘లైట్ ఆఫ్ జాయ్ 2025’ పేరుతో దీపావళి వేడుకలను నిర్వహించారు.
ఈ వేడుకల్లో సమంత స్వయంగా పాల్గొని చిన్నారులతో సరదాగా గడిపారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలబాలికలతో కలిసి నవ్వుతూ, వారితో ఆడిపాడారు. టపాసులు కాల్చుతూ దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. సమంత ఆప్యాయంగా పలకరించడంతో.. చిన్నారులు తమ బాధలను మర్చిపోయి, సంతోషంతో మురిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. “నవ్వు, కృతజ్ఞత, కలయికతో నిండిన అద్భుతమైన సాయంత్రం అది. పిల్లలతో ఆనందంగా గడిపాను” అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ఈ దీపావళి వేడుకల్లో కేవలం ప్రత్యూష సపోర్ట్ మాత్రమే కాకుండా, స్ఫూర్తి ఫౌండేషన్, డిజైర్ సొసైటీ, హ్యాపీ హోమ్స్ వంటి మూడు అద్భుతమైన ఎన్‌జీఓలతో కలిసి సమంత ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌కు సహకరించిన దాతలు, గేమ్స్ నిర్వహించిన సంస్థలు, గిఫ్ట్ హ్యాంపర్స్ అందించిన వారి పట్ల సమంత కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది, ప్రతి బిడ్డ వారు దేనికి కృతజ్ఞతతో ఉన్నారో వ్రాసిన ‘కృతజ్ఞతా కార్యాచరణ’ చాలా ప్రత్యేకంగా నిలిచిందని ఆమె తెలిపారు.
ప్రత్యూష సపోర్ట్ ద్వారా వందలాది మందికి సాయం చేసిన సమంత.. భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది ఎన్‌జీఓలు, చిన్నారులతో కలిసి ఇలాంటి వేడుకలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమంత సామాజిక సేవ, చిన్నారులతో గడిపిన తీరు అందరి హృదయాలను తాకింది.
