SSMB29: మొదలైన SSMB29 మ్యూజిక్ జర్నీ.. నవంబర్‌లో రాజమౌళి భారీ సర్‌ప్రైజ్!
SSMB29: భారతీయ సినీ చరిత్రలో మరో దృశ్యకావ్యం సృష్టించేందుకు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ‘సూపర్ స్టార్’ మహేశ్‌బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంపై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రెండు ముఖ్యమైన అప్‌డేట్‌లు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా సంగీత కార్యక్రమాలు తాజాగా మొదలైనట్లు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాల భైరవ వెల్లడించారు. ‘మోగ్లీ’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. “మా నాన్నగారు (కీరవాణి) పనిచేసే ప్రతి ప్రాజెక్ట్‌లో నాకు పని ఉంటే తప్పకుండా చెబుతారు. ముఖ్యంగా రికార్డింగ్ సెషన్స్‌లో నేను తప్పక పాల్గొంటాను. అలాగే ప్రస్తుతం SSMB29కి సంబంధించిన మ్యూజిక్ పనులు కూడా ఇటీవల ప్రారంభమయ్యాయి. నేను కూడా ఈ సంగీత ప్రయాణంలో భాగమయ్యాను,” అని కాల భైరవ తెలిపారు. దీంతో ఈ సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతంపై ఉన్న ఉత్సుకత మరింతగా పెరిగింది.
ఇక ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ‘అసలైన’ అప్‌డేట్ నవంబర్ నెలలో రానుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. కేవలం టైటిల్‌ను మాత్రమే కాకుండా, ఒక పవర్ ప్యాక్డ్ వీడియోను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయినట్లు సినీ వర్గాలు సమాచారం అందిస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా ఒక ప్రత్యేకమైన ఈవెంట్ లేదా ప్రెస్‌మీట్‌ను నిర్వహించి ఈ వీడియోను విడుదల చేయాలని రాజమౌళి బృందం భావిస్తోంది.
ఈ వేడుకలో సినిమా టైటిల్‌తో పాటు కీలక నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈవెంట్ నిర్వహణకు అనువైన భారీ వేదిక కోసం చిత్ర బృందం అన్వేషణ ప్రారంభించింది. నెల ఆఖరులోగా దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఉత్తర భారతంలోని వారణాశి నేపథ్యంలో సాగే కథతో ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ తాజా అప్‌డేట్‌లతో మహేశ్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
