Bollywood Stars: వారం ముందుగానే దీపావళి సందడి: మనీష్ మల్హోత్రా పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు
Bollywood Stars: భారతదేశంలో అత్యంత ఘనంగా, వెలుగులతో జరుపుకునే పండుగ దీపావళికి వారం రోజులే సమయం ఉండటంతో, దేశమంతటా పండుగ వాతావరణం మొదలైంది. ప్రజలు ఇళ్లను అలంకరించుకుంటూ, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సందడి బాలీవుడ్ సినీ పరిశ్రమలో కాస్త ముందే ప్రారంభమైంది. సినీ తారలు ఇప్పటికే దీపావళి పార్టీలతో జోష్ పెంచేశారు.
ఈ సందర్భంగా, బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన నివాసంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఒక ఘనమైన దీపావళి పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు బీ-టౌన్ నుంచి అనేకమంది ప్రముఖులు హాజరై సందడి చేశారు. కరీనా కపూర్, హేమ మాలిని, రేఖ, ప్రీతి జింటా, జెనీలియా, కరణ్ జోహార్ వంటి సీనియర్ నటులు; అలాగే అనన్య పాండే, కృతి సనన్, ఖుషీ కపూర్, సుహానా ఖాన్ వంటి నేటి తరం నటీమణులు ఈ పార్టీలో మెరిశారు. కాజోల్, అదితిరావ్ హైదరి, వాణీ కపూర్, సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్, మలైకా అరోరా, సారా అలీ ఖాన్ వంటి తారలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ స్టార్-స్టడెడ్ పార్టీకి దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ సభ్యులు హాజరవడం విశేషం. నీతా అంబానీ, రాధికా మర్చంట్ ఈ వేడుకకు వచ్చి సందడి చేశారు. పండుగకు సంబంధించిన సంప్రదాయ దుస్తుల్లో తారలు, ప్రముఖులు అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దీపావళి హంగామాను మరింత పెంచాయి.
