Bison Movie: ధృవ్ విక్రమ్ మూవీ ‘బైసన్’పై సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసలు
Bison Movie: చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘బైసన్’. సంచలన దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా విజయాన్ని, దానిలోని కంటెంట్‌ను మెచ్చుకుంటూ ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు.
సినిమా చూసిన అనంతరం తలైవర్ రజనీకాంత్ స్వయంగా దర్శకుడు మారి సెల్వరాజ్‌కు ఫోన్ చేసి అభినందించడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడు మారి సెల్వరాజ్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రజనీకాంత్ తనతో అన్న మాటలను కూడా ఆయన తెలిపారు. “సూపర్ మారి సూపర్! ‘బైసన్’ చూశాను. సినిమా సినిమాకు మీ కృషి, మీ వ్యక్తిత్వం నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘బైసన్’ విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు” అని తలైవర్ ఫోన్ చేసి చెప్పినట్లు మారి సెల్వరాజ్ వెల్లడించారు.
సూపర్‌స్టార్ నుంచి వచ్చిన ఈ అభినందనలకు మారి సెల్వరాజ్ ఆనందంతో ఉప్పొంగిపోయారు. రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ తన స్పందనను ఎక్స్ ద్వారా పంచుకున్నారు. “నా గత చిత్రాలు ‘పారియేరుమ్ పెరుమాళ్’, ‘కర్ణన్’, ‘మామన్నన్’, ‘వాళై’ విడుదలైనప్పుడు ఎలా అయితే నన్ను పిలిచి మనస్ఫూర్తిగా అభినందించారో, అదే ప్రేమను నా ఐదో చిత్రం ‘బైసన్’ విషయంలోనూ చూపించారు. సూపర్‌స్టార్ గారు మా సినిమా చూసి, దర్శకుడిగా నన్ను, నిర్మాత రంజిత్ అన్నయ్య (పా. రంజిత్)ను ఫోన్‌లో అభినందించారు” అని ఆయన తెలిపారు. తన తరపున, తమ మొత్తం చిత్ర బృందం తరపున రజనీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సెల్వరాజ్ పేర్కొన్నారు.
కబడ్డీ క్రీడా నేపథ్యంతో, సామాజిక అంశాలను ప్రధానంగా జోడించి రూపొందిన ‘బైసన్’ చిత్రం తమిళంలో మంచి ఆదరణ పొందింది. ఈ ప్రశంసలు ‘బైసన్’ చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
