Telangana Assembly Election 2023 : తెలంగాణలో ఎన్నికల తేదీ గడువు దగ్గర పడుతున్న వేళ, పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, బిఆర్ఎస్ తమదైన స్టైల్ లో ప్రచారాన్ని మొదలుపెడితే, నామినేషన్లు ప్రక్రియ మొదలు కావడంతో ఇప్పుడు బిజెపి కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 7 మంగళవారం రోజున ఎల్బీ స్టేడియంలో జరిగే “బీసీ గర్జన” సభలో పాల్గొననున్నారు. ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి తిన్నగా ఎల్బీ స్టేడియం కి వెళ్లి బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఒకవైపు నరేంద్ర మోడీ క్యాస్ట్ పరంగా రాజకీయాలు చేస్తూ ప్రచారంలో కూడా దాన్నే ఒక అస్త్రం లాగా వాడుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.
ఎందుకంటే తెలంగాణలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇక ఈ హామీతో బిసి వర్గాల్లో, ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఊపందుకుంది. ఇప్పుడు బీసీ గర్జన సభను కూడా ఆ నేపద్యంలోనే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. బీసీ గర్జన సభను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు లక్ష మందిని తరలించాలని బిజెపి చూస్తుందని, దానికోసం ఆ పార్టీ ప్రతినిధుల బృందం శ్రమిస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నాయని వినికిడి.
మరోవైపు కాంగ్రెస్ వరస సభలకు ప్లాన్ చేసుకుంది. ఈనెల 9న ముస్లిం మైనారిటీ డిక్లరేషన్ ప్రకటన చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. హైదరాబాద్ లేదా నిజామాబాదులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్తో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేయాలని ప్లాన్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. ఈనెల 10న కామారెడ్డి లో కూడా సభను ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని కాంగ్రెస్ ఆలోచన. కామారెడ్డి సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరవుతున్నాడని వినికిడి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్, బిజెపి జోష్ చూసి ఇక బిఆర్ఎస్ వెంటనే తమ ప్రచారా స్పీడ్ పెంచింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనెల తొమ్మిది వరకు రెండో విడత ప్రచారంలో భాగంగా 10 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 13 నుంచి 28 వరకూ మూడోవిడత ప్రచారంలో భాగంగా 16 రోజుల పాటు 54 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు కేసీఆర్.
దింతో పాటు ఈ నెల 25న హైదరాబాద్లో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించనుంది. ఇక 28 వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగియనుంది.