Telangana Elections 2023 : తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేల, పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నట్టు ప్రత్యక్షంగా ప్రజలే చూస్తున్నారని రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ అలా మాట్లాడడం వెనుక కారణం ఉంది. వరుసగా కాంగ్రెస్ నాయకుల కార్యాలయాల్లో ఐటీ దాడులే దానికి నిదర్శనం.
రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే భావిస్తున్నారు. మొన్నటికి మొన్న తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరావు ఇళ్లలో వరుసగా ఐటీ సోదాలు చేస్తుంది. ఈ సోదాలు కేవలం కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో మాత్రమే జరగడంతో ఇదంతా బిజెపి, బిఆర్ఎస్ కలిసి చేస్తున్న కుట్ర అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే సోదాలు జరిగితే బిజెపి, బీఆర్ఎస్ ఇళ్లల్లో కూడా జరగాలి కదా..? కేవలం కాంగ్రెస్ నాయకులు ఇళ్లలోనే ఎందుకు జరుగుతున్నాయని.? ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన తమిళనాడులో జరిగిన సంఘటనను గుర్తు చేశారు. అచ్చం తమిళనాడులో ఎన్నికలు జరిగిన సమయంలో కూడా డిఎంకె పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం వల్ల, ఇటు కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో, డీఎంకే నాయకుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరిపించారని కానీ అక్కడ చివరికి డిఎంకె పార్టీనే గెలిచిందని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పుడు అదే పద్ధతిని అచ్చం తెలంగాణలో కూడా పాటిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టపోతున్నారని గ్రహించిన బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు భయాందోళనకు గురవుతూ ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇలా పార్టీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా చివరికి విజయం కాంగ్రెస్ పార్టీదే అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
.