OTT Strategy: హిట్ అయినా 4 వారాలకే ఓటీటీలోకి.. త్వరగా స్ట్రీమింగ్ వెనుక ఓటీటీల స్ట్రాటజీ
OTT Strategy: సినిమా రంగంలో ఇటీవల కాలంలో గమనించదగిన ప్రధాన మార్పు ఏమిటంటే, భారీ అంచనాలతో విడుదలై థియేటర్లలో ఘన విజయాన్ని అందుకుంటున్న అగ్ర చిత్రాలు సైతం నెల రోజులు తిరగకముందే ఓటీటీ (OTT) వేదికల్లోకి అడుగుపెడుతున్నాయి. ‘ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్’ అంటూ పోస్టర్లు వెలువడిన కొద్ది వారాలకే ‘స్ట్రీమింగ్‌కు సిద్ధం’ అనే ప్రకటన రావడంతో సినీ ప్రేక్షకులు, పరిశీలకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక ఓటీటీ సంస్థలు అనుసరిస్తున్న సరికొత్త వ్యాపార వ్యూహం దాగి ఉందనేది పరిశ్రమ వర్గాల మాట.
‘ఓజీ’, ‘మిరాయ్’ వంటి సినిమాలు ఈ ట్రెండ్‌కు తాజా ఉదాహరణలు. పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ థియేటర్‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నప్పటికీ, కేవలం నెల రోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ వ్యూహం ఫలించి, తక్కువ సమయంలోనే ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో రికార్డు సృష్టించింది. అదే విధంగా, తేజ సజ్జా ‘మిరాయ్’ కూడా దీపావళి పండుగను లక్ష్యంగా చేసుకుని నెల తిరగకుండానే స్ట్రీమింగ్‌కు వచ్చింది. పండుగ సీజన్‌లో కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించడం ద్వారా ఈ చిత్రం భారత్‌తో సహా అనేక దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.
ప్రస్తుతం చాలా సినిమాలు ముఖ్యంగా అగ్ర కథానాయకుల చిత్రాలు విడుదల కాకముందే భారీ మొత్తానికి ఓటీటీ డీల్స్ పూర్తి చేసుకుంటున్నాయి. ఈ ఒప్పందాల్లో సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‌కు తీసుకురావాలనే షరతులు ఉంటున్నాయి. “విజయవంతమైన చిత్రాలకు థియేటర్లతో పాటు, సోషల్ మీడియాలోనూ మంచి బజ్ (Buzz) ఉంటుంది. ఈ బజ్‌ను క్యాష్ చేసుకోవడమే ఓటీటీల లక్ష్యం,” అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవల రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రిషబ్‌శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ కూడా నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించడం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా రూ.1000 కోట్ల మార్కును చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఓటీటీ తేదీ రావడంతో, కర్ణాటక వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్న థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
బాలీవుడ్ చిత్రాలు మాత్రం ఇంకా 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీనికి భిన్నంగా, అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘కొత్తలోక: చాప్టర్ 1’ మాత్రం 8 వారాల పాటు థియేటర్లలో ప్రదర్శితమై, ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
