Tollywood Film Journalists: నువ్వు హీరో మెటీరియలా? .. తెలుగు సినీ జర్నలిస్టుల వెర్రి ప్రశ్నలు..
Tollywood Film Journalists: ఇటీవలి కాలంలో తెలుగు సినీ కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూలలో జర్నలిస్టుల ప్రశ్నల విధానం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. తమ సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇబ్బంది పెట్టేలా, వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన లేదా వృత్తికి ఏమాత్రం సంబంధం లేని ప్రశ్నలు అడగడం హద్దులు దాటిపోతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఇటీవల జరిగిన రెండు సంఘటనలు సినీ పరిశ్రమలో జర్నలిజం స్థాయిపై తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి. మొట్టమొదట, ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నటి మంచు లక్ష్మి దుస్తులపై ఒక పాత్రికేయుడు మూర్తి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన మంచు లక్ష్మి వెంటనే అతడిని నిలదీయడమే కాక, దీనిపై ఫిలిం ఛాంబర్‌లో అధికారికంగా ఫిర్యాదు కూడా చేశారు.
అయితే, ఈ ఘటన మరువకముందే, మరొక సంఘటన జరిగింది. తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ అనే చిత్రం తెలుగు, తమిళ భాషల్లో దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన తెలుగు ప్రమోషనల్ ప్రెస్ మీట్‌లో ఒక మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఆ జర్నలిస్ట్ ప్రదీప్‌ను ఉద్దేశించి, “మీరు హీరో మెటీరియాలా? మీరు హీరోలా కనిపించరు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ అనూహ్యమైన, వ్యక్తిగత విమర్శతో కూడిన ప్రశ్నకు ప్రదీప్ సమాధానం ఇస్తుండగా, పక్కనే ఉన్న ప్రముఖ నటుడు శరత్ కుమార్ జోక్యం చేసుకున్నారు. ఆయన మైక్ తీసుకుని సదరు జర్నలిస్ట్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. “మీరు ఎవరు హీరోనో, ఎవరు హీరో కాదో అంచనా వేయకూడదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వారికి వారే హీరోలు. సమాజానికి మంచి చేసే ఏ వ్యక్తి అయినా హీరోనే అవుతారు” అని శరత్ కుమార్ బలంగా సమాధానం ఇచ్చారు.
శరత్ కుమార్ రిప్లైకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ప్రదీప్ రంగనాథన్‌కు మద్దతు తెలుపుతూ, మహిళా జర్నలిస్ట్ తీరును, ప్రశ్నను తీవ్రంగా తప్పుబడుతున్నారు. కొందరైతే ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తెలుగు సినీ పరిశ్రమ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని, దీనికి కారణం జర్నలిస్టుల ఆలోచనా విధానం మారకపోవడమేనని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
https://x.com/realradikaa/status/1976913297686643189
