Upendra Movie: సినీ లవర్స్ ఊపిరి బిగబట్టుకోండి.. ఆ కల్ట్ క్లాసిక్ మూవీ రీరిలీజ్ అవుతోంది
Upendra Movie: రీ-రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతున్న వేళ 90వ దశకంలో దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించిన కన్నడ స్టార్ ఉపేంద్ర మాస్టర్‌పీస్ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన ‘ఉపేంద్ర’ చిత్రం అక్టోబర్ 11, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది.
1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో తన విభిన్నమైన కథనం, ప్రేక్షకుల ఊహకు అందని కథాశైలితో ఒక సంచలనం సృష్టించింది. ఒకవైపు కథలో కొన్ని అభ్యంతరకర డైలాగులు, వివాదాస్పద అంశాలు ఉన్నప్పటికీ, ఉపేంద్ర ఆ విషయాన్ని తెరకెక్కించిన విధానానికి, ఆయన ధైర్యానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం తక్కువ కాలంలోనే ‘కల్ట్ ఫాలోయింగ్’ను సొంతం చేసుకుంది. తాజా తరం ప్రేక్షకులకు కూడా ఈ మాస్టర్ పీస్ లాంటి చిత్రాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఇప్పుడు దీనిని రీ-రిలీజ్ చేస్తున్నారు.
ఈ రీ-రిలీజ్ ప్రచారంలో భాగంగా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ నెట్టింట్లో ‘Get ready for a mad experience!’ అనే ట్యాగ్‌లైన్‌తో దూసుకుపోతోంది. ఉపేంద్ర అభిమానులను థియేటర్లలో ఈ మ్యాడ్ అనుభవాన్ని మరోసారి ఆస్వాదించమని ఉత్సాహపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది.
చిన్ననాటి నుంచి నిజాన్నే మాట్లాడాలనే నిబద్ధతతో పెరిగిన వ్యక్తి పాత్రలో ఉపేంద్ర కనిపించారు. ఈ నిబద్ధత కారణంగా అతను జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాడు. తనదైన మార్గంలో జీవనం సాగిస్తూ, ప్రేమ విషయంలో కూడా అసాధారణంగా ప్రవర్తించే అతని మనస్తత్వానికి, ప్రవర్తనకు గల కారణాలు, చివరికి అతను తన ప్రేమను సాధించాడా అనేదే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రంలో రవీనా టాండన్, ప్రేమ, దామిని వంటి ప్రముఖ నటీమణులు కీలక పాత్రలు పోషించారు. గురుకిరణ్ అందించిన సంగీతం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
26 ఏళ్ల క్రితం కొంతమందికే అర్థమైన ఈ సినిమా, ఇప్పుడు మారిన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మరింత పిచ్చెక్కిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
