Mrunal Thakur: బిపాషాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మృణాల్‌కే ఉర్ఫీ జావేద్ మద్దతు..!
Mrunal Thakur: నటి మృణాల్ ఠాకూర్ కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ నటి బిపాషా బసుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ పాత ఇంటర్వ్యూలో మృణాల్, బిపాషా బసు ‘కండలు తిరిగిన పురుషుడిలా’ ఉంటుందని, తాను ఆమె కంటే అందంగా ఉంటానని వ్యాఖ్యానించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో, పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు మృణాల్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఈ వివాదంపై బిపాషా బసు కూడా పరోక్షంగా స్పందించారు. ‘మహిళలంతా దృఢంగా ఉండాలి. అప్పుడే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అమ్మాయిలు శారీరకంగా బలంగా కనిపించకూడదు అనే ఆలోచనల నుంచి బయటపడాలి’ అంటూ ఆమె తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దీనితో వివాదం మరింత ముదరడంతో, మృణాల్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు. ఆ వ్యాఖ్యలు తాను టీనేజర్‌గా ఉన్నప్పుడు అమాయకంగా, ఆలోచించకుండా చేసినవని, ఎవరినీ అవమానించే ఉద్దేశం తనకు లేదని మృణాల్ వివరించారు.
ఈ వివాదంపై ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీ ఉర్ఫీ జావేద్, మృణాల్ ఠాకూర్‌కు మద్దతుగా నిలిచారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఉర్ఫీ జావేద్ స్పందిస్తూ, “మనం యువకులుగా ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో మనకు అంతగా తెలియదు. ప్రతిరోజూ మనం నేర్చుకుంటూ, ఎదుగుతూ ఉంటాం. గతంలో మనం మాట్లాడిన విషయాలతో ఇప్పుడు మనం ఏకీభవించకపోవచ్చు, ఎందుకంటే మనం మారుతాం, మన ఆలోచనలు, విలువలు కూడా మారుతాయి” అని రాసుకొచ్చారు. తాను కూడా గతంలో కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తుచేసుకుంటే తనకు అసహ్యం వేస్తుందని ఆమె తెలిపారు.
ఉర్ఫీ జావేద్‌తో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా మృణాల్‌కి మద్దతుగా నిలిచారు. ఇది ఒక యువ నటి చేసిన తప్పుగా భావించి, అందరూ ఆమెకు క్షమాపణలు చెప్పే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ వివాదం, సెలబ్రిటీలు గతంలో చేసిన వ్యాఖ్యలు వారి భవిష్యత్తుపై ఏ విధంగా ప్రభావం చూపుతాయనే విషయంపై మరోసారి చర్చను రేకెత్తించింది.
