Varahi VijayaYathra : వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడలో సర్పవరం జంక్షన్ లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుక గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మర్చిపోవచ్చు. ఇప్పటికి బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అడుగడుగునా అవినీతి, మహిళల అక్రమ రవాణా, గంజాయి మత్తు, ఇసుక దోపిడీ, స్థలాల కబ్జా ఇలా ప్రతి విషయంలోనూ
సామాన్యులు పడుతున్న వేదనలు నిత్యం చూస్తున్నాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. పిన్షనర్స్ హెవెన్ గా ప్రశాంతమైన నగరంగా పేరున్న కాకినాడను క్రిమినల్స్ కి అడ్డాగా మార్చేస్తోంది వైసీపీ ప్రభుత్వం, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలు పరాకాష్టకు చేరాయి. మరోసారి ఇలాంటి రౌడి గ్యాంగులు గెలిస్తే, పూర్తిగా మన ఇళ్లను కూడా దోచుకునే పరిస్థితి వస్తుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
కాకినాడ నగర నడిబొడ్డున ఉండి చెబుతున్నాను.. ఈ నగరం ఎమ్మెల్యే డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డిని కాకినాడలో మరోసారి గెలవకుండా పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాత కాలం నుంచి ఇలాంటి అరాచకాలే. చంద్రశేఖర్ రెడ్డి తాత అక్రమ బియ్యం, దొంగనోట్లు, దౌర్జన్యాల్లాంటివి చేస్తుంటే అప్పట్లో ఈ జిల్లాకు ఎస్పీగా వచ్చిన ఐపీఎస్ అధికారి అతని నడిరోడ్డు మీద చేతులకు బేడీలు వేసి పోలీసు జీపు వెనుక నడిపించారు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వం యువతను తప్పుదోవ పట్టించడం కొరకు కావాలనే కులాల చిచ్చు రేపి గొడవలకు రెచ్చగొడతారు. ఈ వైసీపీ నాయకులు కులాన్ని అడ్డుపెట్టుకొని అమాయకులను చంపేస్తున్నారు. అలాగే అక్రమ ఇసుక రవాణాకు బాగా అలవాటు పడిపోయారు. వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుక తీసుకొని రవాణా చేస్తూ దాని నుండి కొన్ని వేల కోట్ల ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. అని ఆయన ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు కొరవడిపోయాయి. ఎటువంటి వారికైనా సరే రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేదు. వైసిపి ప్రభుత్వ హయాంలో దాదాపు 33,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు.వాళ్ళను అపహరిస్తున్నది ఎవరు? వైసిపి ప్రభుత్వంలో అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.