Varahi VijayaYathra : జనసేన వారాహి విజయం యాత్రలో భాగంగా కాకినాడ నగర ప్రముఖులు, మేధావులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక భేటీ అయ్యారు. అద్భుతమైన పోర్టు ఉన్న కాకినాడకు అన్ని విధాలా అభివృద్ధి అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. తీర ప్రాంతం ఉన్న చోట అభివృద్ధి అనేది సహజంగా ఉంటుంది. అయితే అందరి మాటలు విన్న తర్వాత కాకినాడ నగరం అనుకున్నంతగా అభివృద్ధి సాధించలేకపోయింది అని అర్ధమవుతుంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
పాలకుల తీరు దీనికి ఒక కారణం అయితే, అవినీతిమయమైన నాయకులను ప్రజలు చట్టసభలకు పంపించడం కూడా మరో కారణం’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన పాలనలో స్వచ్ఛత, బాధ్యత, పారదర్శకత, సుపరిపాలన అనే అంశాలనే ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు వెళ్తాం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జవాబుదారీతనానికి పెద్ద పీట వేస్తాం. ప్రజా పద్దులోని ప్రతి రూపాయికి ఖచ్చితంగా ప్రజలకు లెక్క చూపించే బాధ్యతను తీసుకుంటాం.
సహజ వనరుల దోపిడీని పూర్తిగా అరికట్టేలా చర్యలు ఉంటాయి. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనులకు బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తాం. సమాజంలో ఉన్న వారందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే నిర్ణయాలు ఉంటాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అది ఏ వర్గాలను ప్రభావితం చేస్తుందో వారి అందరి నిర్ణయాలు విన్న తర్వాతే ముందుకు వెళ్లాలి అన్న దానిపై జనసేన కట్టుబడి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, మేధావులుతో పూర్తిస్థాయిలో చర్చిస్తున్నాం. చెప్పే ప్రతి మాటను వింటున్నాం. ఇది ఖచ్చితంగా జనసేన ప్రభుత్వంలో సుపరిపాలనకు దోహదం చేస్తుందని భావిస్తున్నాను అని అన్నారు. ఇసుక దోపిడీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే నెలకి రూ.30 కోట్లు దోపీడీ సాగుతోంది అని తెలియగానే చెప్పగానే పవన్ కళ్యాణ్ విస్తుపోయారు. కాకినాడ నగరంలో మౌలిక సదుపాయాలు కొరత ఉందనీ, స్మార్ట్ సిటీ అని ప్రకటించినా ఆ స్థాయిలో సదుపాయాలు లేవని కొందరు తెలిపారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.