Varahi VijayaYathra : కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రముఖులు, మేధావులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వైసీపీ లాంటి పార్టీలు చేస్తున్న రాజకీయాలు చూసి ఓ వర్గం ప్రజల్లో రాజకీయాల మీద అనాసక్తి పెరిగిపోయింది. డాక్టర్లు, లాయర్లు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, ఔత్సాహికులాంటివారు రాజకీయాలు, సంబంధిత ప్రక్రియపై అనాసక్తి చూపుతున్నారు.
ఇలాంటి కుళ్లు రాజకీయాలు మాకెందుకు అన్న భావన వారిలో బలపడిపోయింది అని ఆయన అన్నారు. పెన్షనర్ల స్వర్గంగా పేరున్న కాకినాడ లాంటి నగరాల్లో ప్రజలు బయటికి వచ్చి ఓటు వేసేందుకు కూడా ఇష్టపడడం లేదు. ఓ విధమైన తటస్థస్థితికి చేరుకుని ఓటు వేయాలంటే అయిష్టత పెరిగిపోయింది. రాజకీయం మనకు సంబంధం లేని వ్యవస్థ అన్న ఆలోచనలు సమాజానికి చేటు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సమాజం పట్ల బాధ్యతలేని పాలకుల వల్ల వ్యవస్థ మొత్తం గాడి తప్పుతుందన్నారు.
మేధావులు, డాక్టర్లు, లాయర్లు, విద్యావేత్తలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశం అయిన పవన్ కళ్యాణ్ వారి,వారి రంగాల్లో ఎదురౌతున్న సమస్యలు, అనుభవాలపై చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాలకులు బాధ్యతగా వ్యవహరించనప్పుడు యంత్రాంగం సక్రమంగా పని చేయదు. ఒక చిన్నపాటి పరిశ్రమ స్థాపించాలని ఎవరైనా అనుకుంటే ఏళ్ల తరబడి అనుమతులు రావు. ఇలాంటి పరిస్థితుల మధ్య
ఎందరో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు వెనక్కి వెళ్లిపోతున్నారు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలను పూర్తిగా చంపేసింది. ఎక్కడ చూసినా ఏదో రకమైన దోపిడి. నా మటుకు నేను మీరు అడిగారు కదా అని నోటికి వచ్చిన హామి ఇచ్చి వదిలేయలేను. ప్రతి వర్గానికీ ఉపయోగపడే విధంగా జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన తేవాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను అని ఆయన వెల్లడించారు.