Varahi VijayaYathra : వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉభయ తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొని ఆయన నాయకులకు దిశ, నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకూడదు. వైసీపీ రహిత గోదావరి జిల్లాలుగా మారాలి.
దానికోసం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బలమైన వ్యూహం ఉండాలి. దానికి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పూర్తిస్థాయి ప్రణాళికతో సంసిద్ధమవ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. డబ్బు, పేరు కాదు.. జనసేన పార్టీ శ్రేణులను బలమైన ఆలోచనా విధానం కలిపింది. మొదటి నుంచి ఓ నిర్థిష్ట విధానంలో నేను బతకాలని అనుకున్నాను. క్రమశిక్షణతో పాటు సమాజాన్ని చదువుతూ ముందుకెళ్లగలిగాను.
నిత్యం నా మనసు బరువుగా ఉంటుంది. ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పి వేల వేదనలు నిత్యం వింటూ, రాత్రి వేళ వారి గురించి ఆలోచిస్తూ బరువెక్కిన గుండెతో నిద్రపోతాను. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు లేవు.. ప్రజల వేదనలు, వారి కన్నీటి గాధలే నన్ను మరింత రాటు దేల్చాయి. ఘోరమైన ఓటమి తర్వాత కూడా నేను
నిలబడి ఉన్నానంటే వారికి ఏదైనా మేలు చేయాలన్న బలమైన సంకల్పమే ముందుకు నడిపిస్తోంది. నాకు డబ్బు వ్యామోహం లేదు. డబ్బు మనిషిగా మారితే పోరాట బలం పోతుందని బలంగా నమ్మేవాడిని. పీడితుల కోసం బలమైన భావజాలం ఉండాలని, అది నిర్థిష్టంగా ఉండాలని నమ్మే వ్యక్తిని. పార్టీ కోసం నిత్యం వేలాది మంది పనిచేస్తున్నారు.
జనసేన పార్టీకి కోట్లాది మంది మద్దతు ఉంది. అందరినీ నేను కలవకపోవచ్చు. మీరు మాత్రం నా ప్రతినిధులుగా వారిని కలవండి. ప్రజల కష్టాలను వినే నాయకుడే భవిష్యత్తులో బలంగా మారతాడు. నన్ను చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయి నుంచి, మిమ్మిల్ని చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయికి ప్రజలను తీసుకురావాలి. వారి కష్టాల్లో, కన్నీళ్లలో జనసేన ప్రతినిధులుగా మీరు తోడుగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.