Bengali Film Industry: టాలీవుడ్‌ను కాపాడేందుకు బెంగాల్ సర్కారు చర్యలు.. ఏంటంటే?
Bengali Film Industry: పశ్చిమ బెంగాల్‌లోని సినీ పరిశ్రమ(టాలీవుడ్)కు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లలో ప్రతిరోజూ తప్పనిసరిగా ఒక బెంగాలీ సినిమాను ప్రైమ్ టైమ్‌లో ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం బెంగాలీ చిత్ర పరిశ్రమ(టాలీవుడ్)ను ప్రోత్సహించడమే కాకుండా, స్థానిక సినిమాల నిర్మాణానికి, పెట్టుబడులకు కూడా తోడ్పడుతుందని భావిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలు ఏమిటి?
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని ప్రతి సినిమా హాల్‌తో పాటు, మల్టీప్లెక్స్‌లోని ప్రతి స్క్రీన్‌పై ఏడాదికి 365 రోజులు ప్రైమ్ టైమ్‌లో ఒక బెంగాలీ సినిమా ప్రదర్శన తప్పనిసరి. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన థియేటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వం ప్రకారం, ప్రైమ్ టైమ్ అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఉన్న సమయం. గతంలో ఈ సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండేది. ఇప్పుడు ఆ సమయాన్ని కుదించి, బెంగాలీ సినిమాలకు ప్రాధాన్యత కల్పించారు.
బెంగాలీ సినిమా రంగానికి కొత్త ఊపు
రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ మాట్లాడుతూ, ఈ చర్యతో బెంగాలీ సినిమా పరిశ్రమకు గొప్ప ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. గతంలో ఏడాదికి కనీసం 120 బెంగాలీ సినిమాలు ప్రదర్శించాలన్న నిబంధన ఉండేదని, ఇప్పుడు ఆ సంఖ్యను 365కి పెంచామని ఆయన చెప్పారు. ఇటీవల బెంగాలీ భాష ఉనికిపై వస్తున్న విమర్శలకు ఈ నిర్ణయం ఒక సరైన సమాధానమని ఆయన అన్నారు.
ఈ నిర్ణయం వల్ల కొత్తగా వస్తున్న దర్శకులు, నిర్మాతలు, నటీనటులకు అవకాశాలు పెరుగుతాయని బిశ్వాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ఆఫ్ సినీ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా అధ్యక్షుడు స్వరూప్ బిశ్వాస్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. బెంగాలీ చిత్రాల సంఖ్య తగ్గుతోందన్న విమర్శలకు ఇది చారిత్రక సమాధానమని ఆయన అన్నారు.
