వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం కాపురం చేసి ఇప్పుడు వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ భార్య తన భర్తపై పెద్దల సమక్షంలో ఫిర్యాదు చేసింది. చీపురుగూడెంకు చెందిన వసంతాడ అనిల్‌కుమార్, తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురానికి చెందిన తమ్మిలేటి నాగరాణి కృష్ణాజిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటీలో చదువుకుంటూ ప్రేమించుకున్నారు.
చదువు పూర్తయ్యాక గతేడాది డిసెంబర్లో సికింద్రాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆర్నెళ్లు కాపురం చేశాక అనిల్‌కుమార్‌కు చెన్నైలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లి ఏవో సాకులు చెబుతూ తనను తీసుకెళ్లలేదని నాగరాణి పేర్కొంది. అయిదు రోజుల కిందట చీపురుగూడెం వచ్చి అత్తవారింటి ముందు ఆందోళన చేసింది.
అనిల్‌కుమార్ తల్లిదండ్రులు తమకు ఈ నెల 19 వరకు గడువు కావాలని కోరడంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మరోమారు చీపురుగూడెం గ్రామానికి వచ్చింది. నల్లజర్ల సీఐ లక్ష్మణరెడ్డి అక్కడికి వచ్చి ఇరువర్గాల వారు సర్దుబాటు చేసుకోవాలని, లేకుంటే ఠాణాకు రావాలని సూచించారు. ఇరువర్గాల పెద్దలు సంప్రదింపులు జరిపినా కొలిక్కి రాకపోవడంతో అనిల్‌కుమార్ పెద్దలు మరో 15 రోజులు గడువు కావాలని అడిగారు.
