Tanuj Mauli: యూత్ సెన్సేషన్ మౌళికి మెగా బంపరాఫర్.. రూ.1 కోటి రెమ్యునరేషన్ ఇస్తున్న మైత్రీ
Tanuj Mauli: యూట్యూబ్ వీడియోలతో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఇప్పుడు టాలీవుడ్‌లో యువతరం ఆశాకిరణంగా మారిన హీరో తనుజ్ మౌళి అరుదైన అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. గతేడాది ‘హాష్‌ట్యాగ్ 90స్’ వెబ్ సిరీస్‌తో యూత్ ఐకాన్‌గా మారిన మౌళి, తన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతడు హీరోగా నటించిన తొలి చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించి, అతడి మార్కెట్‌ను ఒక్కసారిగా పెంచింది.
చిన్న బడ్జెట్‌లో తెరకెక్కిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం ఏకంగా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, టాలీవుడ్‌లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఓటీటీ వేదికలోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఘన విజయం తర్వాత మౌళికి డిమాండ్ అమాంతం పెరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు, యువ దర్శకులు ఆయనతో కలిసి పనిచేయడానికి తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో, టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మౌళికి బిగ్ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. సాధారణంగా మొదటి సినిమా విజయంతోనే యువ హీరోలకు ఇంత పెద్ద ఆఫర్ రావడం అరుదు. అయితే, మౌళి రెండో సినిమాకే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో అవకాశం దక్కించుకున్నారని, ఈ ప్రాజెక్ట్‌కు గాను ఏకంగా రూ.1 కోటి రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ ఒప్పందం కింద మైత్రీ సంస్థ మౌళికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్లు ఇండస్ట్రీ టాక్.
‘లిటిల్ హార్ట్స్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మౌళి కెరీర్ అనూహ్యంగా మారిపోయింది. ఈ క్రమంలోనే మైత్రీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా చేయడం అనేది అతడికి ఒక పెద్ద బ్రేక్ అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే, మైత్రీ మూవీ మేకర్స్‌తో తన కొత్త ప్రాజెక్ట్, అందుకు తీసుకున్న రెమ్యునరేషన్‌పై హీరో మౌళి అధికారికంగా స్పందించాల్సి ఉంది.
