Zootopia 2: కొత్త పాత్రలతో సరికొత్తగా జూటోపియా 2.. ట్రైలర్ మామూలుగా లేదుగా..!
Zootopia 2: వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యానిమేటెడ్ చిత్రం ‘జూటోపియా 2’ ట్రైలర్, పోస్టర్ తాజాగా విడుదలయ్యాయి. 2016లో విడుదలైన మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో.. ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సీక్వెల్‌లో అభిమానుల ఫేవరెట్ జంట జూడీ హాప్స్, నిక్ వైల్డ్ మరోసారి కలిసి వినోదం పంచనున్నారు. అయితే ఈసారి వారి భాగస్వామ్యంలో కొన్ని కొత్త సవాళ్లు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. కొత్తగా విడుదలైన ట్రైలర్ ప్రకారం, జూడీ, నిక్ ఇద్దరూ తమ తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక థెరపిస్ట్ దగ్గరకు వెళ్లడం ఆసక్తికరంగా ఉంది.
‘గ్యారీ డిస్నేక్’ అనే పామును పట్టుకోవడమే..
వీరిద్దరికీ కొత్త మిషన్ కూడా ఎదురవుతుంది. జూటోపియా నగరంలోకి ప్రవేశించిన ‘గ్యారీ డిస్నేక్’ అనే అనుమానాస్పద పామును పట్టుకోవడమే వారి లక్ష్యం. ఈ పాము నగరంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. జూడీ, నిక్‌ల అన్వేషణలో భాగంగా జూటోపియాలో ఇంతకుముందు చూడని కొత్త ప్రాంతాలను కూడా పరిచయం చేయనున్నారు.
ఈ చిత్రంలో మరిన్ని కొత్త పాత్రలు కూడా రానున్నాయి. నటులు కే హ్యూ క్వాన్ గ్యారీ డిస్నేక్‌కు, క్వింటా బ్రన్సన్ థెరపిస్ట్ డాక్టర్ ఫజ్‌బైకి, ఫార్చూన్ ఫెంస్టర్ నిబుల్స్ అనే పాత్రకు తమ గాత్రాన్ని అందించారు. మొదటి భాగంలోని గాజెల్ పాత్రలో షకీరా, చీఫ్ బోగో పాత్రలో ఇద్రిస్ ఎల్బా తిరిగి రానున్నారు. ఆస్కార్ విజేతలు జారెడ్ బుష్, బైరన్ హోవార్డ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, నవ్వులు, భావోద్వేగాలు, మిస్టరీతో నిండిన ఒక అద్భుతమైన అడ్వెంచర్‌గా ప్రేక్షకులను అలరించనుంది.
హ్యూమర్, ఎమోషన్, మిస్టరీతో..
జూటోపియా 2.. యవెట్ మెరినో నిర్మాణంలో వాల్ట్ డిస్ని యానిమేషన్ స్టూడియోస్ రూపొందించిన 64వ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా నిలువనుంది. హ్యూమర్, ఎమోషన్, మిస్టరీతో కూడిన ఈ అడ్వెంచర్‌ను అభిమానులు థియేటర్లలో చూసేందుకు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు.
