Varun Tej Lavanya Tripathi : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మెగా వారసుడు వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ట్రాక్ నడిపిస్తున్న ఆయన.. ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. వీరి నిశ్చితార్థ వేడుకను అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో హైదరాబాద్‌లోని నాగబాబు స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిరంజీవి, అల్లు అరవింద్, లావణ్య కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని తెలిసింది.
వరుణ్ – లావణ్య ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించారు. మిస్టర్ మూవీ టైంలోనే వీరిద్దరిలో ప్రేమ చిగురించగా ఏడేళ్ల సుదీర్ఘకాలం అనంతరం ఏడడుగులతో వీరు ఒక్కటవ్వనున్నారు. అయితే మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి అడుగుపెట్టనుండటంతో గత కొన్నిరోజులుగా అభిమానులు ఆమె కుటుంబ నేపథ్యం గురించి నెట్టింట్లో ఆరా తీస్తున్నారు. డిసెంబర్ 15న 1990లో యూపీలోని ఫైజాబాద్ లో లావణ్య త్రిపాఠి జన్మించింది. ఆ తర్వాత లావణ్య ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ లో పెరిగింది.
లావణ్య తండ్రి లాయర్ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆమె తల్లి టీచర్ టీచర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కాగా.. ఆమె అక్క కమిషనర్ గా పనిచేస్తుంది. లావణ్యకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. డెహ్రాడూన్ లో పాఠశాల విద్య పూర్తి చేసిన లావణ్య తర్వాత ముంబయికి షిఫ్ట్ అయింది. ముంబయిలోని రిషి దయారామ్ నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ పై ఆసక్తితో టీవీ షోల్లో కనిపించింది.
ఆమె పాఠశాలలో చదివే రోజుల్లోనే 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ ని గెలుచుకుంది. అంతే కాకుండా శాస్త్రీయ నృత్యంలో కూడా నైపుణ్యం సాధించింది. 2012లో వచ్చిన అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది లావణ్య. చివరగా లావణ్య హ్యాపీ బర్త్ డే మూవీలో నటించగా.. ఇటీవల పులిమేక వెబ్ సిరీస్ లో కనిపించింది. తానల్ అనే తమిళ్ మూవీలో చేస్తుంది. కాగా రెండు నెలల అనంతరం.. ప్రేమ పుట్టిన ఇటలీలోనే వరుణ్, లావణ్యల వివాహం జరగనుందని సమాచారం.