Ambajipeta Marriage Band Movie Special Story : తమిళ్ లో తీసినట్టుగా తెలుగు దర్శకులు సినిమాలు తీయలేరు. నిజాలని నిగ్గు తేల్చలేరు. సమాజ కోణాన్ని అందుకోలేరు అని విమర్శలు తెలుగు ఇండస్ట్రీ పైన చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కులం, మతం అనే దృష్టి కోణం నుండి తెలుగులో సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి.
కానీ తమిళ సినిమాల్లో కులము, మతము గురించి సామాజిక అంశాలను టచ్ చేస్తూ తమ హక్కుల కోసం పోరాడే సినిమాలను కూడా చేస్తూ, తమిళ ఇండస్ట్రీ ఒకమెట్టు ఎక్కువ స్థాయిలోనే ఉందని చెప్పవచ్చు. అయితే తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కొన్ని ప్రయత్నాలు ఈమధ్య మొదలవుతున్నాయని ఆశాజనకంగా కనిపిస్తుంది.
కానీ అవి ఆశించినంత ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. తెలుగు ప్రజలు ఆ సినిమాలను జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ఈ నేపథ్యంలో వచ్చిన చిన్న బడ్జెట్ సినిమా అయినటువంటి “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా ప్రేక్షకులను తన వైపుకు లాక్కుంటుంది.
లవ్ స్టోరీ లకు, యాక్షన్ ఫిలిమ్స్ కి మాత్రమే పరిమితమైన తెలుగు ఇండస్ట్రీ, ఇప్పుడు కొత్త దర్శకులతో ఒక కొత్త ఒరవడిని సృష్టించబోతుందని అనుకోవచ్చు. ముఖ్యంగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో తక్కువ స్థాయి కులస్తులకు, ఆసామి దురహంకారానికి మధ్యలో జరిగే ఒక పోరాటముగా సినిమాను మలచిన తీరు, అందులో నటించిన పాత్రలు జీవించడం, సినిమాకు ప్రధాన అంశంగా విజయం వైపు దూసుకు వెళ్లడానికి ఉపయోగపడింది.
హీరో సుహాన్ మంచి కథలను సెలెక్ట్ చేసుకుని తనదైన నటనతో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఈ సినిమాలో సుహాన్ అక్కగా శరణ్య నటించిన తీరు, ఒక మహిళ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎలా పోరాటం చేసిందనే తీరు చక్కగా చూపించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ హీరోను హై లెవెల్ లో చూపించి, నాలుగు ఫైట్లు రెండు పాటలు, భారీ భారీ సెట్లను వేసి భారీ భారీ ఫైటింగ్ లు పెట్టి,
నాలుగు పవర్ఫుల్ డైలాగులు పెడితే సరిపోతుందనే దృష్టి కోణం పోయి, సమాజానికి ఉపయోగపడే విధంగా నేటి యువత ఆలోచించే విధంగా సినిమాలు తీయడానికి కొత్త దర్శకులు ఆసక్తిని చూపడం నిజంగా ఇదొక మలుపుని చెప్పవచ్చు. “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా ఒక కుల అణిచివేతకు ఒక మార్గాన్ని నిర్దేశించే దానిలాగే ఉంది.
నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎన్నుకొని ప్రతి ఒక్కరు ఆ సినిమాలో జీవించారు. ఇలాంటి మార్పు కోరుకునే సినిమాలు నేటి సంస్కృతి లో రావడం చాలా అవసరం. మొదటగా చిన్న సినిమాగా ప్రారంభమైన “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా సమాజపు ఆలోచన విధానం కలిగిన వాళ్లను తన వైపుకు లాక్కుంటుంది. చూద్దాం తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా నిజాలను నిగ్గు తేల్చే సమాజానికి ఉపయోగపడే మరిన్ని సినిమాలను తీయగలుగుతుందేమో.