BalaKrishna & Boyapati : సీన్ రివర్స్.. బాలయ్య హిట్ సినిమాని బీట్ చేసిన బోయపాటి ఫ్లాప్ మూవీ
ఓటీటీ ప్రభావం వల్ల క్రమంగా థియేటర్, టీవీ లెక్కలు మారిపోతున్నాయి. కొన్ని చిత్రాలు థియేటర్స్ లో సూపర్ హిట్ అయినప్పటికీ టీవీల్లో రాణించడం లేదు. కొన్ని ఫ్లాప్ చిత్రాలకు కూడా బుల్లితెరపై మంచి ఆదరణ లభిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు.
తాజాగా ఇలాంటి ఉల్టా పల్టా సన్నివేశమే చోటు చేసుకుంది. గత ఏడాది నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ మూవీగా నిలిచింది. తొలిసారి బాలయ్య చేత అనిల్ రావిపూడి తెలంగాణ యాసలో డైలాగులు చెప్పించాడు. అలాగే సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఫలితంగా బాలయ్యకి అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా హ్యాట్రిక్ హిట్స్ పడ్డాయి.
ఆ స్టార్ హీరోకి నందమూరి బాలకృష్ణ సీరియస్ వార్నింగ్.. కారణం ఇదే..
మరోవైపు బాలయ్యకి అచ్చొచ్చిన బోయపాటి శ్రీను.. రామ్ పోతినేని హీరోగా స్కంద చిత్రాన్ని తెరకెక్కించారు. బోయపాటి మాస్, రామ్ ఎనెర్జీ తో మినిమమ్ హిట్ గ్యారెంటీ అనుకున్నారు. కానీ ఈ చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. అయితే ఊహించని విధంగా స్కంద చిత్రం.. భగవంత్ కేసరిని బుల్లితెరపై బీట్ చేసింది. అదెలా అనుకుంటున్నారా.. అయితే ఈ లెక్కలు చూడండి.
భగవంత్ కేసరి, స్కంద చిత్రాలు గత వారం ఒకే రోజు టీవీల్లో ప్రసారం అయ్యాయి. స్టార్ మా లో స్కంద చిత్రాన్ని టెలికాస్ట్ చేయగా 8.4 టీఆర్పీ సాధించింది. అదే రోజు జీ తెలుగులో ప్రసారం అయిన బాలయ్య భగవంత్ కేసరి చిత్రం మాత్రం 7.6 రేటింగ్ తో సరిపెట్టుకుంది. ఒక ఫ్లాప్ మూవీ హిట్ చిత్రాన్ని టీఆర్పీ రేటింగ్ లో వెనక్కి నెట్టడం ఆశ్చర్యమే కానీ దీనికి కారణం లేకపోలేదు.
హిట్ సినిమాని ఎక్కువమంది ఆడియన్స్ థియేటర్స్ లో చూసేస్తారు. ఆ చిత్రానికి రిపీట్ వాల్యూ ఉన్నప్పుడే బుల్లితెరపై కూడా మంచి రేటింగ్స్ వస్తాయి. స్కంద ఫ్లాప్ చిత్రం అయినప్పటికీ బోయపాటి, రామ్ కాంబినేషన్ అనే క్రేజ్ ఉంది. పైగా స్కంద చిత్రంలో బోలెడు మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బుల్లితెరపై ఈ స్కంద రాణించడానికి బహుశా ఇవే కారణాలు కావచ్చు.