BJP Political Strategy : గ్లోబల్ సెన్సేషన్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం ఆ పాటను ‘మోదీ.. మోదీ’గా పేరడీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపి అందరి గుండెల్లో నాటుకున్న నాటు నాటు పాట ఖ్యాతి మరింత పెరిగింది. అందుకే కర్ణాటక ఎన్నికల వేళ అధికార బీజేపీ ఆ పాటను వాడేసుకుంటోంది. మోదీ.. మోదీ అంటూ అదే బీట్‌తో దుమ్ము రేపుతోంది.
ఎన్నికళ వేళ ప్రజాదరణ పొందిన పాటల్ని వాడుకోవడం రాజకీయ పార్టీలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనుకుంటా. 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రేక్షకాదరణ పొందిన పాట జయహోను వాడుకుంది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీ నాటు నాటు పాటతో దుమ్మ రేపేందుకు ప్రయత్నిస్తోంది. మరోసారి అధికారంలో రావాలని ప్రయత్నిస్తోన్న బీజేపీ అన్ని మార్గాల్ని అవలంభిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా నరేంద్ర మోదీ చరిష్మానే నమ్మకుంది.
ఇప్పటికే పలు సందర్భాల్లో కర్ణాటకను సందర్శించిన ప్రధాని మోదీ వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేశారు. బీజేపీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ పాట సాగుతుంది. సాంగ్ లో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. శివమొగ్గ విమానాశ్రయం, బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే, మెట్రో లైన్‌లు మరియు గత మూడేళ్లలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను సాహిత్య రూపకంగా చెప్పారు. ఇవాళ విడుదలైన ఈ సాంగ్ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల వేళ హల్‌చల్ చేస్తోంది.