Karnataka Election Results : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అధికారంలోకి ఏ పార్టీ వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం కష్టం అని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. మే 13వ తేదీన ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయిన తరువాత ఏం చెయ్యాలో అని బీజేపీ నాయకులు తర్జన బర్జన పడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఇప్పటికే బీజేపీ ఆధినాయకత్వం రంగంలోకి దిగినట్లు సమాచారం.
కర్ణాటకలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేక పవనాలు ఎక్కువగా బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే ఆపరేషన్ కమలాను మరోసారి తెరమీదకు తీసుకురావడానికి బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ దిశ అడుగులు వేస్తున్నారని?, జేడీఎస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎలాంటి లాభాలు, ఎలాంటి సమస్యలు ఉంటాయి అని బీజేపీ హైకమాండ్ ఇప్పటికే కర్ణాటక బీజేపీ నాయకులతో చర్చించారని తెలిసింది.
బీజేపీలో టిక్కెట్లు దక్కకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ టిక్కెట్లు సంపాధించి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులతో కూడా బీజేపీ పెద్దలు చర్చలు జరపడానికి సిద్దమయ్యారని తెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో బలంగా ఉన్న కర్ణాటకలో అధికారం కోల్పోతే పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశం ఉందని ఆందోళన కమలదళంలో మెదలైంది. ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అందరూ సిద్దంగా ఉండాలని కర్ణాటకలోని కొందరు బీజేపీ పెద్దలకు ఆమిత్ షా సూచించారని తెలిసింది. కర్ణాటకలో కింగ్‌మేకర్ కాకుండా తామే ‘కింగ్’ అవుతామంటూ జేడీఎస్ నేత కుమారస్వామి మొదటి నుంచి చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆ పార్టీతో కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీ ఆ రెండు పార్టీల్లో ఏదైనా ఓ పార్టీ జేడీఎస్ తోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నుంచి సంప్రదింపులు మొదలయ్యాయని అన్నారు.
జేడీఎస్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందని సరైన సమయంలో విషయం వెల్లడిస్తామని.. తమ మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేవన్నది జేడీఎస్ ధీమా.
ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని దేవేగౌడ అభిలాష మేరకు జేడీఎస్ కాంగ్రెస్‌కే మద్దతు ఇవ్వనుందని పార్టీ వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పెద్దలు ఇదే విషయంపై సిద్ధరామయ్యతో మంతనాలు కొనసాగిస్తున్నారు. తమకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని.. సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశమే లేదని భాజపా విశ్వాసం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ కూడా తమ పార్టీ 141 సీట్లు సాధించి ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఏది ఎమైనా ఓటర్లు తీర్పును నిక్షిప్తం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసి అధికారిక ఫలితాలు వెల్లడించే వరకూ వేచి ఉండక తప్పదు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేత ఓటరే అన్నది జగమెరిగిన సత్యం.