Pawan Kalyan : అచ్యుతాపురం సెజ్, ఫార్మా కంపెనీలో జరిగినటువంటి పేలుడు ప్రమాదాన్ని గురించి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ప్రమాదాలు పరిపాటిగా మారిపోవడం విచారకరం. ఓ ఫార్మా కంపెనీలో నేడు జరిగిన భారీ పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను.
గత రెండు మూడేళ్లుగా ఎల్టీ పాలిమర్స్, సైనార్ ఫార్మా, రామ్ కీ సాల్వెంట్ ఇండస్ట్రియల్ ప్లాంట్ తదితర కర్మాగారాల్లో జరిగిన ప్రమదాల్లో సంభవించిన ప్రాణనష్టం ఆందోళన కలిగించే స్థాయిలో ఉండడం గమనార్హం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? మానవ తప్పిదమా? అలక్ష్యమా? సరైన
ప్రమాణాలు పాటించకపోవడమా? నిర్దిష్టమైన యంత్రపరికరాలు వాడకపోవడమా? అన్న సంగతి అధికారులు ఎప్పటికప్పుడు విచారణ జరిపించి బాహ్య ప్రపంచానికి వెల్లడించవలసి ఉంది అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే మొక్కుబడిగా విచారణ జరిపి ఫైలు మూసేయడం కారణంగా మిగిలిన వారిలో ఒక రకమైన నిర్లక్ష్య భావన చోటుచేసుకునే అవకాశం ఉంది.
ఇప్పుడు సాహితీ ఫార్మాలో ప్రమాదం జరిగినట్టు సమాచారం అందుతోంది. తరచూ ఇటువంటి ప్రమాదాలు జరగడం అనర్ధదాయకం. ఇకనైనా అధికారులు మేల్కొని ప్రమాదాలు జరగకుండా రక్షణాత్మక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం సంభవించకుండా ప్రమాణాలు పాటించాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను. బాధిత కుటుంబాలకు ఇతోధికంగా నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తీవ్రంగా గాయపడిన నలుగురికి మేలైన వైద్య సాయం అందించాలి. వారి ప్రాణాలు కాపాడాలని అధికారులను కోరుతున్నాను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.