Varahi VijayaYathra : అమలాపురంలో మేధావులు, విద్యావేత్తలు, వివిధ సంఘాల నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పాలసీలు, వాటి అమలు తీరుపై వారితో చర్చించారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం ముసుగులో ప్రజల హక్కులను కాలరాస్తోంది. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ ని సవ్యంగా అమలు చేస్తే వీళ్లకి నవరత్నాలతో అవసరం ఏముంది? సబ్ ప్లాన్ ని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ముఖ్యమంత్రి సబ్ ప్లాన్ ను పట్టించుకునే స్థితిలో కూడా లేరని పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నా పాలకులకు, ప్రజలకు మంచి చేయాలన్న మనసు లేదని చెప్పారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరూ నిలదీయాలి. ఓ సమస్య మీద పోరాడేటప్పుడు పార్టీలు, కులాలకు అతీతంగా చేయాలని సూచించారు. మనవాడు తనవాడు అన్న భావన లేకుండా పాలకులపై ఒత్తిడి తీసుకురావాలని అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇష్టానికి మళ్లించేస్తుంటే అడిగేవారు లేరు. సబ్ ప్లాన్ నిధులు ఇతర అవసరాలకు మళ్లించరాదన్న నిబంధన ఉన్నా దాన్ని పాలకులు పట్టించుకోరు.
సబ్ ప్లాన్ సవ్యంగా అమలు అవుతుందా? లేదా? ఎందుకు అమలు కావడం లేదు? అనే అంశాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒక సమూహంగా పోరాటం చేయాలి. ఒకప్పుడు మధ్యతరగతి చాలా బలమైన ఆలోచన కలిగి ఉండేది. ఎవ్వరికీ భయపడకుండా బయటికి వచ్చి మాట్లాడే వారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ గా పేరున్న ఉభయ గోదావరి జిల్లాల్లో కాప్ హాలిడే ప్రకటిస్తే ఒక్క అధికారి కూడా పరిస్థితిపై లోతుగా అధ్యయనం చేసి రైతులతో మాట్లాడలేదు. నేను వచ్చినప్పుడు మాత్రమే పనులు జరుగతాయంటే ఎలా?
ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ బాధ్యతలు నిర్వర్తించాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిబంధనలు సడలించాలన్న నిబంధన ఉన్నా.. దాన్ని అమలు చేయరు. రైతు భరోసా కేంద్రాల పేరు చెప్పి అడ్డంగా మోసం చేస్తున్నారు. మిల్లర్ ఎవరిదో ఫోన్ నెంబర్ ఇచ్చి బస్తాకి రూ. 100 లంచం తీసుకుంటున్నాడు. వ్యవసాయం లాభసాటిగా లేదు. సామాన్యుడికి న్యాయం చేసే ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నాయి. వాటిని సరిగా అమలు చేస్తే రోజు వారీ వ్యాపారాలు చేసుకునే వారు వడ్డీ వ్యాపారుల బారిన పడాల్సిన అవసరం ఏముంది..? ఇలాంటి అన్ని అంశాల మీద దీర్ఘకాలిక అధ్యయనం అవసరం. ప్రాంతీయ అవసరాలను బట్టి సబ్సిడీలు అమలు చేయాలి.