Varahi VijayaYathra : వారాహి విజయయాత్రలో భాగంగా భీమవరంలో శెట్టిబలిజ, గౌడ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీ కులాలకు సంపూర్ణ రాజ్యాధికారం అందాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. స్థానిక ఎన్నికల్లో 33 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించడంతో దాదాపు 16వేల మంది బీసీలకు అన్యాయం జరిగిందన్నారు.
జనసేన పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గించిన బీసీ రిజర్వేషన్లు పెంచడంతో పాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్లుగీత సొసైటీలకు వాటా కల్పిస్తామన్నారు. ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు తీసుకోవడంతోపాటు శెట్టిబలిజ, గౌడ, సంబంధిత కులాలకు కమ్యునిటీ హాల్స్, కళ్యాణ మండపాలు నిర్మించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో స్థలాలు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
బీసీల కోసమంటూ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటిని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. వైసీపీ సానుభూతిపరులు, మద్దతుదారులను కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించారు తప్ప బిసీలకు ఎలాంటి మేలు చేయలేదు. శెట్టిబలిజ, గౌడ, శ్రీశైన ఈడిగ, యాత ఇలా ప్రాంతాల బట్టి విభిన్న పేర్లతో పిలుస్తున్న ఈ సామాజికవర్గాన్ని ఏకీకృతం చేసి గౌడ సామాజికవర్గంగా గుర్తించాలని సామాజికవర్గ పెద్దలు కోరుతున్నారు.
ప్రాంతాల బట్టి విడిపోయి పలుచన అయ్యే బదులు కలిసి బలంగా ఉండాలనే జనసేన పార్టీ కోరుకుంటుంది. ఐదు కులాలను కలిపి సర్దార్ గౌతు లచ్చన్న గారు ప్రతిపాదించిన విధంగా గౌడు సామాజికవర్గంగా గుర్తించాలని పెద్దల కొరకకు జనసేన మద్దతు తెలుపుతుంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. విభజించు పాలించు అనే బ్రిటిష్ వాడి పద్ధతిని వైసీపీ ప్రభుత్వం ఫాలో అవుతుంది. మనలో మనకు గొడవలు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుంది.
ఒక కులంలోనే ఉన్న ఉప కులాలను విడగొట్టి పలుచన చేస్తోంది. గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజలకు, కాపులకు పడదని చెప్పారు. కులాలను కలిపి ఆలోచన విధానంలో భాగంగా రెండు సామాజికవర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారిలో ఐక్యత వచ్చేలా చేశాం. రామ్ మనోహర్ లోహియా అగ్రకులానికి చెందిన వ్యక్తి. అయినా దేశంలో అత్యధికంగా ఉన్న బీసీల గురించి ఆయన తపన పడ్డారు. నేను కోరుకుంటుంది కూడా అదే.
అత్యధికంగా ఉన్న బీసీలు రాజ్యాధికారానికి చేరువగా వెళ్లాలి. అందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. బీసీల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. బీసీలకు రక్షణ కల్పించడంలోనూ వైసీపీ విఫలం అవుతోంది. బాపట్ల జిల్లాలో అమరనాథ్ గౌడ్ అనే 15 ఏళ్ల బాలుడిని తగులబెట్టి చంపేశారు. న్యాయం జరగని చోట ఖచ్చితంగా కులం సంఘటితం అవుతుంది. ఆ బాలుడిని చంపిస్తే రూ.లక్ష విలువ కట్టిన ప్రభుత్వ తీరుని నిరసించాలి అని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు.