Varahi VijayaYathra : వారాహి విజయయాత్రలో భాగంగా ముమ్మిడివరం వీరమహిళలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అంగన్వాడీ మహిళలు, మహిళా సంఘాల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు వేరుశనగ చిక్కిలు ఇస్తున్నారు. ఎక్కడో తయారు చేసినవి ఇస్తుండటంతో అవి పాడైపోతున్నాయి.
నాణ్యత ఉండటం లేదు. స్థానికంగా ఉండే స్వయం సహాయక మహిళ సంఘాలకు ఈ చిక్కీలు తయారు చేసే బాధ్యత అప్పగిస్తే బాగుంటుంది. ఎప్పటికప్పుడు తాజాగా ఉండటంతోపాటు అందాల్సిన పోషకాలు పిల్లలకు అందుతాయి. దీనిని వైసీపీ ప్రభుత్వం మరిచిపోయిందని మహిళలు తమ ఆలోచనను పవన్ కళ్యాణ్ గారితో పంచుకున్నారు. ఉచితాలు బదులు ఉపాధి కల్పించే మార్గాలు చూపిస్తే రాష్ట్రం అప్పులు పాలు కాదని చెప్పారు.
పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఇంటర్, డిగ్రీ కళాశాల భవనాలు శిధిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు ఆ భవనాలు కూలిపోతాయో తెలియక విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు క్షేత్రస్థాయిలో సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు.
డ్వాక్రా సంఘాల్లో మహిళలు దాచుకున్న పొదువు సొమ్ము గురించి ప్రశ్నిస్తే రకరకాల కారణాలు చెబుతున్నారని, ఆ సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. కనీసం పొదుపు సొమ్ము మీద లెక్కలు చూపడానికి కూడా క్షేత్రస్థాయిలో సరైన వ్యవస్థ లేదన్నారు. అమ్మ ఒడి డబ్బులు తల్లుల ఖాతాల్లో వేస్తే పిల్లలకు నాణ్యమైన చదువు రాదని నిపుణులైన ఉపాధ్యాయులను నియమిస్తే
పిల్లలకు మంచి చదువు వస్తుందని ఈ సందర్భంగా వీరమహిళలు తమ మనసులోని మాటను చెప్పారు. వీటితో పాటు దశాబ్దాలుగా స్థానికంగా పేరుకుపోయిన సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు అన్ని సావధానంగా విన్న పవన్ కళ్యాణ్ జనసేన ప్రభుత్వం రాగానే ప్రాధాన్యతానుసారం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వీర మహిళలకు హామీ ఇచ్చారు.