Varahi VijayaYathra : వారాహి విజయయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ముమ్మిడివరం బహిరంగసభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రైతాంగాన్ని అన్నీ విషయాల్లోనూ వైసీపీ మోసం చేసింది. వైసీపీని 70 శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షాల్లోని అనైక్యత పోవాలి.సమాజంలోని అన్ని కులాలూ బాగుండాలన్నదే నా ఆకాంక్ష.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా పేరును జనసేన మనస్ఫూర్తిగా స్వాగతించింది. కుట్ర కోణంలోనే వైసీపీ అరాచకం సృష్టించింది
తనపై తట్టెడు కేసులు పెట్టుకొని కేంద్రంతో ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు..? రాష్ట్రానికి ఏం సాధిస్తాడు అనేది ఆలోచించాలి’ అని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. రాష్ట్రం గురించి, ప్రజల గురించి ఏ మాట్లాడతాడో ఒకసారి బాగా ఆలోచించండన్నారు. నేను రైతులకు ఏ అన్యాయం జరిగినా ముందుండి పోరాడుతాను కేంద్రం నుంచి ఏం రావాలన్నా దైర్యంగా అడుగుతాను అని చెప్పారు. నన్ను నమ్మండి.. పవన్ కళ్యాణ్ మీ వాడు. మీకు మేలు చేసేవాడని తెలిపారు.
రాజకీయాలు చేయాలంటే పెట్టి పుట్టక్కర్లేదు. గుండెనిండా మానవత్వం నింపుకొని ప్రజల కష్టాలను వినేతత్వం ఉంటే చాలన్నారు. జనానికి న్యాయం చేసే మనసు ఉండాలని తెలిపారు. ఒక్కసారి, ఒక్కసారి అంటూ అడిగితే, నమ్మిన పాపానికి ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడో గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అధికారం కోసం ప్రజల్ని అంధకారంలోకి నెట్టిశాడని తెలుసుకోండి. నన్ను రైతాంగం అంతా ఒక్కసారి విశ్వసించండి. మీ బతుకుల్లో వెలుగులు తెచ్చే బాధ్యతను నేను తీసుకుంటాను.
నేను ప్రజల తరపున బలంగా పోరాడాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. వైసీపీ ప్రభుత్వ తప్పులను భరించలేక విసిగిపోయి, తెగించి గొడవ పెట్టుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర అవినీతి సొమ్ము లేదు.గూండాలు లేరు. నాకు ఆ తల్లి వారాహి అమ్మ రక్షణ..కులాల గురించి మాట్లాడితే వైసీపీ వాళ్ళకి కోపం వస్తోంది. రాష్ట్రంలో రెండే కులాలు అధికారం.. ఆర్థిక వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరదు. సాగరాన్నే నమ్ముకున్న మత్స్యకారుడు. స్వేదం చిందించి కుటుంబానికి చుక్కానిగా మారే దళిత సోదరుడు.
చెట్టు ఎక్కి బతుకు సాగించే గీత కార్మికుడు. డొక్కలు ఎండిపోయేలా మగ్గం లాగే నేత కళాకారుడు.కళను రంగరించి కుండలు చేసే శాతవాహనుడు. కొలిమిలోని నిప్పుతో అద్భుతమైన ఆభరణం చేసే విశ్వబ్రాహ్మణుడు.. పది మందికి మంచిని పంచే ముస్లిం సోదరులు. ఇలా ఉత్పత్తి కులాలన్నీ బాగుపడాలి. వారికి ఆర్ధికదన్ను రావాలి. అధికారం చేతపట్టేలా చూడాలి. వారి ఆలోచనలు సమాజానికి పంచాలి. ఇది జనసేన కోరుకుంటున్న అసలు లక్ష్యం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.