Varahi VijayaYathra : వారాహి విజయయాత్రలో దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ ఏటిమొగలో మత్స్యకారుల అత్మీయ సమావేశంలో పాల్గొని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దానశీలి మల్లాడి సత్యలింగ నాయకర్ వారసులు మీరు తన, మన బేధం లేకుండా ప్రతి ఒక్కరికీ సాయం చేసిన ఆ గొప్ప వ్యక్తి తరాల సంపద మీరు, ప్రభుత్వం విదిలించే అరకొర సాయానికి దేహీ అనాల్సిన పని మీకు లేదు.
మీరు పది మందికి మత్స్యసంపదను పంచే సంపద సృష్టికర్తలు, మీరంతా స్వయంశక్తి సాధించే దిశగా పుట్టిందే జనసేన షణ్ముఖ వ్యూహం.ప్రతి మత్స్యకారుడు ఆర్ధికాభివృద్ధి సాధించి ఆనందంగా ఉండాలన్నదే మా లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మీకు బతికే హక్కు, సంపాదించే హక్కు ఉంది.. ఉపాధిని దెబ్బతీస్తే వారి మీద పోరాటం చేసే హక్కు ఉంది.
మీ పోరాటానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఎన్నికల ప్రక్రియలో భాగం మాత్రమేనని, ప్రజా సమస్యల కోసం నిలబడడమే రాజకీయ పార్టీగా జనసేన నిలిచిపోతుందన్నారు. వ్యవసాయంతో పాటుగా మత్స్య సంపదను సేకరించే మత్స్యకారులను సమంగా చూస్తామన్నారు.
మత్స్యకార సోదరులందరికీ ఓ బాధ్యత గల రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నా కమిట్ మెంట్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. 2009లో తెలంగాణలోని ఓ గిరిజన తండాలో తాగునీటి కోసం ఓ అంద వృద్ధురాలు కన్నీరు పెట్టుకుంటే, ఆ రోజు ఆ తాగునీటి సమస్యను తీర్చేందుకు అధికారం వస్తేనే చేయాలని భావించలేదు. వెంటనే సొంత డబ్బుతో స్నేహితులను పంపి బోరు వేయించాను. పదవి కోసం అయితే నేను ఇంత తపన పడనవసరం లేదు.
ఇంత మందితో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దివీస్ ను బంగాళాఖాతంలో కలుపుతామన్న పెద్దమనిషి ఎక్కడ..? రాష్ట్రానికి ఉన్న 976 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అంటిపెట్టుకుని వందలాది మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులు వేటి వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. అదే ప్రాంతం ఓఎన్జీసీతో పాటు మరికొన్ని కెమికల్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు ప్రధాన కేంద్రంగా మారింది.
ఈ ప్రాంతంలో అభివృద్ధితో పాటు విధ్వంసమూ కనబడుతోంది. తీర ప్రాంతానికి ఎలాంటి హాని జరిగినా మత్స్యకారులు మొత్తం నలిగిపోతారు, గంగవరం పోర్టు కావచ్చు,తొండంగి మండలంలో ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమలు కావచ్చు, అవి మత్స్యకారుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి అని పవన్ కళ్యాణ్ అన్నారు.