Varahi VijayaYathra : రోజు రోజుకు నూతన ఉత్సాహంతో జనసేన అధినేత జనసేనాని ముందుకు సాగిపోతూనే ఉన్నారు. ప్రజల నీరాజనాలు, మద్దతు, ప్రేమాభిమానాలు మధ్య పవన్ కళ్యాణ్ యాత్ర విజయోత్సాహంతో సాగుతుంది. అమలాపురం పట్టణం జనవాహినితో కళకళలాడింది. పుర వీధుల్లో విజయనాదం చేస్తూ జనసేన శ్రేణులు గర్జించాయి.
కదం తొక్కుతూ వారాహి రధం వెంట పదం కదుపుతూ వేలాది మంది జనసైనికులు, వీర మహిళలు తరలిరాగా పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర నిర్వహించారు. పట్టణంలో బస ఏర్పాటు చేసిన సత్యనారాయణ గార్డెన్స్ నుంచి అమలాపురం గడియారం సెంటర్ వరకు పట్టణంలో రహదారులన్నింటిని జనప్రవాహం ముంచెత్తగా ఐదు కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించారు.
వేలాది ద్విచక్ర వాహనాలు ర్యాలీగా తరలిరాగా రహదారికి ఇరువైపులా జన ప్రవాహం అనుసరించగా గురువారం సాయంత్రం గం. 6.15 నిమిషాలకు మొదలైన విజయ యాత్ర కోనసీమ నడిబొడ్డున మూడు గంటల పాటు సాగింది. ప్రతి అడుగులో ఆడపడుచులు రోడ్ల మీదకు వచ్చి హారతులు పట్టారు. మరికొంత మంది గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. ప్రతి హారతిని ప్రేమతో స్వీకరించి పవన్ కళ్యాణ్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
కలెక్టరేట్, కోర్టు సెంటర్, నల్ల వంతెన మీదుగా వారాహి యాత్ర సాగింది. నల్లవంతెన రోడ్డులో వీర మహిళలు ప్రొక్లెయిన్ బక్కెట్లలో నిలబడి మరీ హారతులు ఇచ్చారు. తన కోసం వచ్చిన ఏ ఒక్కరినీ నిరాశపర్చకుండా దారి పొడుగునా అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగ స్ఫూర్తితో రోడ్ షో మొత్తం స్టార్ హీరోలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ హీరోగా ఎవరిని అయినా అభిమానించుకోండి.
రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేనకు అవకాశం ఇవ్వమంటూ సందేశాలను ప్రదర్శించారు. ప్రజలు సమస్యలు ప్లకార్డుల మీద రాసి ప్రదర్శించారు. జనసేన వారాహి విజయ యాత్రతో పార్టీ శ్రేణులు పట్టణం మొత్తం 50 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, హోర్డింగులతో నిండిపోయింది. యాత్ర సాగిన రహదారికి ఇరువైపులా ఉన్న భవనాలు మొత్తం జనంతో నిండిపోయాయి. రమణంవీధి వద్ద వారాహి రథాన్ని అధిరోహించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
సభా ప్రాంగణ ప్రదేశం గడియారం స్థంభం సెంటర్ వరకు అభిమానుల జేజేల మధ్య విజయ యాత్ర నిర్వహించారు. భవనాల నుంచి జనసేనుడిని ఆడపడుచులు పూల వర్షంతో ముంచెత్తారు. సభా స్థలి దగ్గర ఉన్న జన సందోహాన్ని చూస్తే అమలాపురం పుర ప్రజలంతా అక్కడే ఉన్నారు అనడం అతిశయోక్తి కాదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చివర్లో హలో ఏపీ.. టైటై వైసీపీ అంటూ ఇచ్చిన నినాదంతో గడియారం స్థంభం సెంటర్ హోరెత్తింది. వారాహి విజయ యాత్ర పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.