Varahi VijayaYathra : వారాహి విజయయాత్ర ఆంధ్రప్రదేశ్ లో ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో మనకు విధితమే. ప్రజా శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ చేపట్టిన విజయ యాత్ర ఆంధ్రాలో ప్రత్యేక విశిష్టతను చాటుకుంది. ఎక్కడ చూసిన ప్రజల నిరాజనాలతో ముందుకు దూసుకు వెళ్తున్న విజయయాత్ర ఎన్నో సభలు, సమావేశాలు, ప్రజా కలయికల మధ్య నిర్విరామంగా సాగుతూనే ఉంది..
ఈ నేపథ్యంలోనే భారీ బహిరంగ సభను నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, పార్టీ ముఖ్య నేతలు కూడా నిర్ణయించుకున్నారు అని సమాచారం. దాంట్లో భాగంగానే..జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 30వ తేదీన భీమవరంలో బహిరంగ సభ నిర్వహిస్తారు అని తెలుస్తోంది. ఆ రోజు సాయంత్రం 5 గం.కు భీమవరం అంటేడ్కర్ సెంటర్ లో వారాహి నుంచి ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.
బహిరంగ సభ ప్రణాళిక కోసం ముందుగా మంగళవారం సాయంత్రం భీమవరం శివార్లలోని కళ్యాణ మంటపంలో ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లా నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. భీమవరంలో నిర్వహించే సభ ఎంతో ప్రాముఖ్యమైనదిగా అందరూ భావించాలి.
ఈ కార్యక్రమం అనంతరం వారాహి విజయ యాత్రకి స్వల్ప విరామం ఇస్తాం అని ఆయన అన్నారు. తిరిగి ప్రారంభించే యాత్ర రూట్ మ్యాప్ పై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, జిల్లాకు చెందిన పిఏసీ సభ్యులు, నియోజక వర్గాల ఇంచార్జులు, ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.