Varahi VijayaYathra : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాకతో నరసాపురం పట్టణం జనసంద్రంగా మారింది. అడుగడుగునా హారతులతో ఆడపడుచుల అభివాదం చేయగా, జనసైనికుల హర్షాతిరేకాల మధ్య పట్టణంలో జనసేనాని భారీ ర్యాలీ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారు బస చేసిన ప్రాంతం నుంచి బహిరంగ సభ ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు రహదారులు జనంతో కిటకిటలాడాయి. సభకు బయలుదేరిన జనసేనానికి ఆడపడుచులు ప్రతి అడుగులో హారతులు పెట్టారు.
జనసైనికులు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. నరసాపురం పట్టణం మొత్తం వారాహి విజయ యాత్ర కోసం కట్టిన స్వాగత తోరణాలు, బ్యానర్లతో నిండిపోయింది. ప్రతి బ్యానర్ మీద జనసేన వారాహి యాత్రకు విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి స్వాగత వచనాలతో పాటు హాల్లో ఏపీ… టైటై వైసీపీ.. జనం బాగుండాలంటే.. జగన్ పోవాలి నినాదాలు దర్శనమిచ్చాయి. వారాహి యాత్ర బహిరంగ సభకు తరలివచ్చిన అశేష జనవాహినితో నరసాపురం బస్టాండ్ సెంటర్ కిక్కిరిసింది. సభ ఆద్యంతం హల్లో ఏపీ.. టైటై వైసీపీ నినాదాలతో ప్రతిధ్వనించింది.
రాజ్యాధికారం జనసేనతోనే సాధ్యం అంటూ శెట్టి బలిజ సోదరులు ప్రదర్శించిన ప్లకార్డులు పవన్ కళ్యాణ్ గారిని ఆకర్షించాయి. ఇప్పటి వరకు అధికారం దక్కని వెనుకబడిన కులాలకు రాజ్యాధికార సాధనకు జనసేన కట్టుబడి ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. జనసేనాని ఇచ్చిన నినాదం అందరు హీరోల్ని అభిమానిస్తాం.. ప్రజా క్షేమాన్ని కాంక్షించే జనసేనకు ఓటు వేస్తామనే నినాదాలతో కూడిన ప్లకార్డు సైజు ప్లెక్సీలు జనసమూహంలో పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి.
ఆశేష జనవాహిని జేజేల మధ్య జనసేన ప్రచార రథం వారాహి అధిరోహించి పవన్ కళ్యాణ్ గారు సమర శంఖం పూరించారు. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఆధ్యంతం జనసైనికులు, వీరమహిళల కేరింతల మధ్య సాగింది. సభలో ప్రసంగిస్తూ తన చిన్ననాటి జ్నాపకాలను శ్రీ పవన్ కళ్యాణ్ నెమరవేసుకున్నారు. నరసాపురం బస్టాండ్ లో చిన్నతనంలో తాను తప్పిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సభకు చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.