Varahi VijayaYathra : పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్రలో భాగంగా ఆయన బుధవారం రోజు ముమ్మిడివరంలో ప్రముఖులు, కార్మిక, కర్షక వర్గాలతో సమావేశం అయ్యారు. అన్నం పెట్టే రైతుల విషయంలో రాజకీయాలకు అతీతంగా జనసేన పార్టీ అండగా నిలుస్తుంది. గిట్టుబాటు ధర లేక కాయకష్టం చేసిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి దళారులు అనాయాసంగా రైతులని దోచుకొని సంపాదిస్తున్నారు. అన్నం తినే ప్రతి ఒక్కరికీ రైతు బాధ తెలియాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఉత్పత్తి కులాల వద్ద పెట్టుబడి లేకపోవడం వల్లే దళారులు శాసిస్తున్నారు. జనసేన పార్టీ పాలన పగ్గాలు చేపట్టాకా ఆ పెట్టుబడి ప్రభుత్వం ద్వారా అందిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ రైతులు, మత్య్సకారులతో పాటు వివిధ వర్గాల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికి ఉమ్మడి కార్యచరణ అవసరం.
రైతు సమస్యల పరిష్కారానికి కలసి వస్తామంటే అన్ని పార్టీల్లో ఉన్న రైతు సంఘాలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మనలో అనైక్యత వల్లే దళారులు దోచుకుంటున్నారు. తుపాను వచ్చినప్పుడు వైసీపీ రైతుల పంటలకు మాత్రమే నష్టం వాటిల్లదు. ఒకప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే గోదావరి జిల్లాలు నేడు చాలా ఇబ్బందులుపడుతున్నాయి. గోదావరి
జిల్లాల్లో రైతుని రక్షించుకోలేకపోతే ఆ ప్రభావం మిగిలిన జిల్లాల మీద కూడా పడుతుంది అని పవన్ వెల్లడించారు. రైతుల పక్షాన రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచేందుకు నేను సిద్ధం. పంట పండించిన రైతుకి మద్దతు ధర వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. క్రాప్ హాలిడే ప్రకటించి నిరసన తెలుపుతున్నా అధికారులు తొంగి చూడడం లేదు ఈ పరిస్ధితులు మారాలి అని ప్రభుత్వ వైఖరి పై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
మత్స్యకార గ్రామాల్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గ్రామాల్లో 40 శాతం ప్రజలకు ఇప్పటికీ తాగునీరు లేదు. సంఘటితంగా ఉన్న కులాలను కార్పోరేషన్ల పేరిట విభజించారు. రాజకీయ నిరుద్యోగులకు పదవులు ఇచ్చారు. 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే సరిపోదు. ఆయన రాజ్యాంగం ద్వారా సామాన్యులకు అందించిన హక్కులను కాపాడాలి. రాజ్యాంగ ధర్మాన్ని అనుసరించి పాలన చేయాలి. అన్ని కులాలను కలుపుకుని వెళ్లాలి.
అంబేద్కర్ గారి సిద్ధాంతాలు పాటించడం అంటే రాజ్యంగ హక్కులు అందరికీ సమంగా పంచడం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దివగంత దామోదరం సంజీవయ్య గారు, దివంగత జి.ఎమ్.సి. బాలయోగి గారు ప్రజల కోసం ఆలోచన చేసిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి. వాళ్ళు తమ కోసం కాదు బావి తరాల కోసం పని చేశారు. జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తుంది. కులాలను కలిపి ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకువెళ్తుందన్నాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.