Varahi VijayaYathra : భీమవరంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డి తెలంగాణలోని తన రూ.300 కోట్ల ఆస్తిని కాపాడుకోవడానికి తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తులను మొత్తం ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాక, తెలంగాణకు వదిలేసి వచ్చేశాడు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందాల్సిన వేల కోట్ల ఆస్తులు అవి, తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశాడు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని 23 కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించింది. దాని గురించి మాట్లాడని ఈ వైసీపీ పాలకులు తమ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రజల ఆస్తులను వదిలేశారు. కానీ బీసీలను జాబితా నుంచి తొలగిస్తే కనీసం నోరెత్తలేదు. ఇలాంటి ద్వంద్వ నీతి కలిగిన వైసీపీ నాయకులు అంటే నాకు కోపం. అందుకే నా గొంతు బలంగా మారుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..బీసీ కులగణన అనేది అవసరం అని జనసేన పార్టీ భావిస్తోంది. జనాభా ప్రతిపాదిక లెక్కల వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. దామాషా పద్ధతి ప్రకారం ఎవరు ఎంతమంది ఉన్నారో తెలిస్తే, వారికి అన్ని విషయాల్లోనూ తగిన న్యాయం జరుగుతుంది. జనసేన పార్టీ బీసీ కుల గణన జరగాలని ఆకాంక్షిస్తుంది. గణన కోసం అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు..
సివిల్ సొసైటీ బలంగా మారాలి. చైతన్యవంతం కావాలి. అప్పుడే పాలకులకు భయం ఉంటుంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రశ్నించినా, వారి తీరుకు ఎదురు తిరిగినా పోలీసులు కనీసం కేసు కూడా తీసుకోవడం లేదు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చిన్న ఫిర్యాదు వచ్చినా వారిని బతకనీయడం లేదు. వ్యవస్థలు సరిగా పనిచేయక, కుల సమూహాలు పెరిగిపోయాయి. చట్టం సరిగా పనిచేస్తే, అందరికీ సమాన న్యాయం జరిగితే కుల నిర్మూలన సాధ్యమే అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
