Balagam Movie Review : సినిమా రివ్యూ : బలగం
నటీనటులు : ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు తదితరులు
ఛాయాగ్రహణం : ఆచార్య వేణు
పాటలు : కాసర్ల శ్యామ్
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సమర్పణ : శిరీష్
నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత
దర్శకత్వం : వేణు యెల్దండి (వేణు టిల్లు)
విడుదల తేదీ : మార్చి 3, 2023
సినిమాలు, కామెడీ షోలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన నటుడు వేణు టిల్లు. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ‘దిల్’ రాజు వారసులు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. ఇంతకీ బలగం ఎలా ఉందంటే..
కథ:
తెలంగాణలోని ఓ పల్లెటూర్లో ఉండే సాయిలు (ప్రియదర్శి)కి రెండు రోజుల్లో నిశ్చతార్థం ఉంటుంది. వచ్చే కట్నం డబ్బులతో తన అప్పులను తీర్చుకోవాలనేది సాయిలు ఆలోచన. అయితే అనుకోని కారణాలతో తాతయ్య కొమురయ్య (సుధాకర్ రెడ్డి) చనిపోతాడు. కొమురయ్యకు ఇద్దరు కొడుకులు ఐలయ్య (జయరాం), మొగిలయ్య, ఒక కుమార్తె లక్ష్మి ఉంటారు. లక్ష్మి భర్త నారాయణ (మురళీధర్)తో ఐలయ్య, మొగిలయ్యలు ఇరవై ఏళ్ల క్రితం చిన్న గొడవ పడతారు.
అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య మాటలుండవు. కొమురయ్య చనిపోయాడని తెలిసిన తర్వాత లక్ష్మి, నారాయణ.. ఐలయ్య ఇంటికి వస్తారు. కర్మకాండల సమయంలో కాకులకు పెట్టే ముద్దలను కాకి ముట్టనే ముట్టదు. అసలు కాకులు ఎందుకలా చేస్తున్నాయో అర్థం కావు. మరో వైపు అప్పుల ఇబ్బందుల్లో ఉన్న సాయిలుకి మామయ్య నారాయణకి చాలా ఆస్తులున్నాయని తెలుస్తుంది.
దీంతో ఆయన కూతురు సంధ్య (కావ్యా కళ్యాణ్ రామ్)ని ప్రేమలో దించే ప్రయత్నం చేస్తాడు. అసలు సాయిలు ఎందుకు అప్పుల పాలవుతాడు? కొమురయ్యకు పెట్టే ముద్దను కాకులు ఎందుకు ముట్టవు? చివరకు గొడవలు పడుతున్న కుటుంబ సభ్యులు ఎలా కలిశారు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సెల్ ఫోన్స్ వాడుతున్న ఈ కాలంలోనూ తెలంగాణ మారుమూల పల్లెల్లోని మూఢనమ్మకాలను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు వేణు సక్సెస్స్ అయ్యాడు. సినిమాలో క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. సెన్సిటివ్ గా ఉండేవారికి తప్పకుండా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.
చిత్రం చూస్తోంటే, 2015లో కన్నడలో రూపొంది, పలు అవార్డులు సంపాదించిన ‘తిథి’ చిత్రం పలు మార్లు గుర్తుకు వస్తుంది. కాసర్ల శ్యామ్ సందర్భోచితంగా పాటలు పలికించారు. ఇందులోని నటీనటుల్లో చాలామంది అంతగా పరిచయం లేనివారే, అయితే దాదాపుగా అందరూ తమపాత్రల్లో జీవించారనే చెప్పాలి. కమర్షియల్ గా ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
ప్లస్ పాయింట్స్:
* దిల్ రాజు ప్రొడక్షన్ కావడం
* నిర్మాతలు ఈ కథను ఎంచుకోవడం
* పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
* కథలో కొత్తదనం లేకపోవడం
* సీన్స్ సాగదీసినట్టుగా ఉండడం
ట్యాగ్ లైన్ : విలువలు భావోద్వేగాలతో హృదయాల్ని బరువెక్కించే మూవీ.. బలగం
రేటింగ్ : 2.75/5
Discussion about this post