మూవీ : గాడ్ ఫాథర్
విడుదల తేదీ : అక్టోబర్ 05, 2022
నటీనటులు: చిరంజీవి, నయనతార, సల్మాన్ ఖాన్, సత్య దేవ్, పూరీ జగన్నాధ్, సముద్రఖని, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సునీల్, అనసూయ తదితరులు
దర్శకత్వం : మోహన్ రాజా
నిర్మాతలు: రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాథర్. మలయాళం లో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన లూసిఫర్ కి ఇది రీమేక్. సత్యదేవ్, నయనతార కీలకపాత్రలు పోషించగా సల్మాన్ ఖాన్ మరో ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకుడు. థమన్ మ్యూజిక్ అందించారు. దసరా కానుక గా నేడు విడుదలయిన ఈ సినిమా ఎలా ఉందో ఇపుడు చూద్దాం.
ముఖ్యమంత్రి పీ.కే.ఆర్ హఠాత్మరణం తర్వాత రాష్ట్రానికి సీఎం కావాలన్న హోం మంత్రి వర్మ (మురళి శర్మ) మరియు పి.కే.ఆర్ అల్లుడు జయదేవ్ (సత్యదేవ్) కుట్రలను బ్రహ్మ (చిరంజీవి) ఎలా తిప్పి కొట్టాడు? జయదేవ్ నుండి రాష్ట్రాన్ని, పార్టీని, పీ.కే.ఆర్ ఫ్యామిలీని ఎలా కాపాడాడు అన్నదే క్లుప్తంగా గాడ్ ఫాదర్ మూవీ కథ. అసలు పీ.కే.ఆర్. కి బ్రహ్మకు సంబంధం ఏంటి? పీ.కే.ఆర్ కూతురు సత్యప్రియ బ్రహ్మను ద్వేషించడానికి కారణమేంటి? అనేది తెరమీద చూడాల్సిందే…
ఖైదీ నెంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ తో మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సైరా మూవీ సోసో అనిపించినా.. తర్వాత వచ్చిన ఆచార్య చిరంజీవి కెరీర్ లోనే ఘోరపరాజయాన్ని మూట కట్టుకుంది. తర్వాత చిరంజీవి మలయాళ సినిమా లూసిఫర్ ని రీమేక్ చేస్తున్నారు అన్నప్పుడు ఆల్రెడీ చూసేసిన సినిమా.. పైగా ఓటిటి లో ఉన్న సినిమానే కదా అన్న కామెంట్స్ వినిపించాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా మనకి ఒక రీమేక్ సినిమా చూస్తున్నట్లు అనిపించదు. తెలుగు నేటివిటీ తగ్గట్టు కథలో ఎక్కడ సోల్ మిస్ అవ్వకుండా మార్పులు చేశారు దర్శకుడు మోహన్ రాజా. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో మాస్ ప్రేక్షకులను అలరించే ఎలివేషన్స్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసే ట్విస్టులతో సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు.
గాడ్ ఫాథర్ పాత్రకు చిరంజీవి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ఇక సత్యప్రియ పాత్రలో నయనతార అద్భుతంగా చేసింది. ఆ పాత్రకు ఆమెనే కరెక్ట్ ఛాయిస్ అనే విధం గా క్లాసీ లుక్ తో ఉంది. విలన్ గా చేసిన సత్యదేవ్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని పాత్రకు ఇంకొంత ప్రాముఖ్యత ఇవ్వాల్సింది అనిపించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేసింది చిన్న పాత్ర అయినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోకుండా కాస్త గుర్తుంచుకోదగ్గ పాత్రని చేశారు. ఉన్నది కాసేపైనా తనదైన మేనేజర్స్ తో స్టైల్ తో అలరించాడు. తెర మీద చిరంజీవి, సల్మాన్ ఖాన్ కనిపించినప్పుడు హాల్ దద్దరిల్లిపోయింది. జర్నలిస్టు పాత్రలో పూరి జగన్నాథ్ కీలకపాత్రలో తనదైన డైలాగులతో అలరిస్తాడు. మిగిలిన పాత్రలలో సునీల్, షఫీ, బ్రహ్మాజీ, మురళి శర్మ, అనసూయ నటించారు బిగ్ బాస్ దివి కి కూడా కీలకమైన పాత్ర లభించింది.
గాడ్ ఫాథర్ ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా. సమకాలీన రాజకీయ అంశాలు, కుట్రలు, కుతంత్రాలు, మీడియా ధోరణి ఇలాంటి ఎపిసోడ్లతో ఫస్ట్ ఆఫ్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మాటల రచయిత లక్ష్మీ భూపాల రాసిన పంచులు భలే పెలాయి. అన్నిటికన్నా ముఖ్యంగా తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా ఉంది. మ్యూజిక్ అదరగొట్టేసాడు. జైలు ఎపిసోడ్, యాక్షన్స్ సన్నివేశాలు అలరిస్తాయి. క్లైమాక్స్ వరకూ అద్భుతంగా సాగిన ఈ చిత్రం క్లైమాక్స్ మాత్రం రొటీన్ మాస్ మసాలా అనిపించింది. ఐటెం సాంగ్ ఇరికించినట్టు అనిపిస్తుంది. ఒక క్లైమాక్స్ రొటీన్ గా ఉండడం తప్ప మొత్తానికి గాడ్ ఫాదర్ ఒక చక్కని రీమేక్. ఒరిజినల్ చూసిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఫాన్స్ కి మాత్రం పండగే.
ట్రెండ్ ఆంధ్రా రేటింగ్ : 3.5/5