Rangabali Review : నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, షైన్ టామ్ చాకో తదితరులు
నిర్మాణ సంస్థ: SLV సినిమాస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
సంగీతం: పవన్ సీహెచ్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
విడుదల తేదీ : 7/7/2023
హీరో నాగశౌర్య పేరు చెప్పగానే మంచి క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. అలానే చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘ఛలో’ తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కట్లేదు. ఇప్పుడు ‘రంగబలి’ అనే కమర్షియల్ ఎంటర్టైనర్తో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీ నాగశౌర్య చెప్పినట్లు ఉందా? సినిమా టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం..
కథ :
రంగబలి.. ఏపీలోని రాజవరంలో ఓ సెంటర్‌కు పేరు. హీరో శౌర్య (నాగశౌర్య)కు ఆ ఊరు అంటే సెంటిమెంట్. మొసలికి నీటిలోనే బలం ఉన్నట్టు.. హీరోకు కూడా పుట్టి పెరిగిన ఊరులో ఉంటేనే తనను అందరూ గుర్తిస్తారని భావిస్తాడు. ఈ నేపథ్యంలో విశాఖలోని ఓ మెడికల్ కాలేజీలో సహజ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత హీరోయిన్ తన ప్రేమను తన తండ్రికి (మురళీ శర్మ) కు చెబుతోంది.
వీరి పెళ్లికి మొదట ఒప్పుకున్న హీరోయిన్ ఫాదర్.. అతనిది రంగబలి ఉండే ఊరు అని తెలుసుకొని.. ఆ ఊరు విడిచిపెట్టి విశాఖకు వచ్చేయమంటాడు. దీనికి హీరో ఒప్పుకోడు. ఇంతకీ హీరో, హీరోయిన్ల ప్రేమకు అడ్డుగా మారిన రంగబలి సెంటర్‌కు ఆ పేరు ఎందుకొచ్చింది. హీరోయిన్ ఫాదర్ వీరి పెళ్లికి అడ్డుగా నిలిచిన రంగబలి సెంటర్ పేరు వెనక ఉన్న కహాని ఏమిటనేదే మిగతా సినిమా స్టోరీ.
రివ్యూ :
రంగబలి సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్, కామెడీ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. ప్రథమార్థం అలానే సాగుతుంది కూడా. ఎక్కడా బోర్ కొట్టించకుండా ఫస్ట్ హాఫ్‌ను డైరెక్టర్ బాగానే ప్లాన్ చేసుకున్నాడు. పాత కథే అని అనిపిస్తున్నా.. ఎక్కడా కొత్త సీన్లు లేవేంటి? అని అనిపిస్తున్నా కామెడీ, సత్య టైమింగ్‌తో ఫస్ట్ హాఫ్ అలా నవ్వులతో సాగుతూ ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే సరదాగా ఉంటుంది.
ఇక సెకండాఫ్‌లో రంగబలి సెంటర్ పేరు మార్చాలనే కాన్సెప్ట్‌కు సంబంధించిన ట్రాక్ ఫర్వాలేదనిపించే స్థాయిలో వెళ్తుంది. గుర్రం సీన్, శరత్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఇంటెన్స్ ఉండాల్సిన చోట కథ తేలిపోయినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు కామెడీని నమ్ముకోవడం వల్ల రంగబలి కథను పండించే ఎమోషన్స్ మిస్ అయిందనిపిస్తుంది. కానీ కామెడీ సినిమాలను ఆశించే వారికి ఎలాంటి నిరాశ, అసంతృప్తికి గురి చేయదనే ఫీలింగ్ ఓవరాల్‌గా కలుగుతుంది.
తొలి చిత్ర దర్శకుడిగా పవన్ ఎంచుకొన్న పాయింట్‌కు న్యాయం చేశారని చెప్పవచ్చు. కథను వినోదాత్మకంగా నడిపించిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఇంకాస్త వర్క్ చేసి ఉంటే డెఫినెట్‌గా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ అయి ఉండేదనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే: సరదాగా సాగే పక్కింటి కుర్రాడి తరహా పాత్రలు పోషించడం నాగశౌర్యకు కొత్తేమీ కాదు. ఇందులోని శౌర్య పాత్రను తను అవలీలగా చేసుకు వెళ్లిపోయాడు. యాక్షన్ సన్నివేశాల్లో మరింత ఎనర్జీతో కనిపించాడు. సహజ పాత్రలో యుక్తి సహజంగా కనిపించింది. ఆమెకు శౌర్యకు మధ్య లవ్ ట్రాక్ రొటీన్ గా అనిపించింది. అయితే ద్వితీయార్ధంలో వచ్చే ఓ రొమాంటిక్ పాటలో గ్లామర్ బాగా ఒలికించింది యుక్తి.
ఎదుటివాడు సంతోషపడితే తట్టుకోలేని అగాధం అనే పాత్రలో సత్య నటన కడుపుబ్బా నవ్విస్తుంది. ఒకరకంగా ప్రధమార్థానికి తనే హీరో. అలాగే జాకెట్లు కుట్టే టైలర్ రాజ్‌కుమార్ పాత్ర కూడా అక్కడక్కడా నవ్వులు పూయిస్తుంది. గోపరాజు రమణ, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. శరత్ కుమార్ పాత్ర కనిపించేది కొద్దిసేపైనా ఆకట్టుకుంటుంది. ప్రతినాయకుడిగా షైన్ టామ్ పాత్ర ఆరంభంలో శక్తిమంతంగా కనిపించినా.. చివరికి వచ్చే సరికి పేలవంగా మారిపోయింది.
ఆ పాత్రకు సరైన ముగింపు ఇవ్వలేకపోయారు. కమర్షియల్ కథల్లో కామెడీని మిక్స్ చేయడం ఓ కళ. దాన్ని పవన్ చక్కగా చేసి చూపాడు. అయితే అసలు కథ మొదలయ్యాక తను కాస్త గాడితప్పాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుకోలేకపోయాడు. పవన్ సిహెచ్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. నేపథ్య సంగీతం మాత్రం ఫర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
* కథ
* ఫస్టాఫ్ కామెడీ
* సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
* సెకండాఫ్
* కనెక్ట్ కానీ ఫ్లాష్ బ్యాక్
* ఎడిటింగ్
రేటింగ్ : 2.5/5
ట్యాగ్ లైన్ : ‘రంగబలి’.. కాస్త ఫన్ కాస్త ఎమోషన్ ఉండే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్.
Discussion about this post