Vimanam Movie Review : నటీనటులు : సముద్రఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్, రాజేంద్రన్ తదితరులు
మాటలు : హను రావురి
ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు
పాటలు, సంగీతం : చరణ్ అర్జున్
నిర్మాణం : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి
రచన, దర్శకత్వం : శివ ప్రసాద్ యానాల
విడుదల తేదీ: జూన్ 9, 2023
తమిళ నటుడు, దర్శకుడైన సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు మంచి విలన్‌గా సుపరిచితుడే. అయితే ఆయన రొటీన్‌కు భిన్నంగా అవిటివాడైన తండ్రి పాత్రలో నటించిన చిత్రం ‘విమానం’. టీజర్, ట్రైలర్ చూస్తే విమానం ఎక్కాలనే కొడుకు కోరికను తండ్రి ఎలా నేరవేర్చాడనే కథాంశంతో రూపొందినట్లు అర్థమవుతుంది. అసలు పిల్లవాడికి విమానం ఎక్కాలనే కోరిక ఎందుకు పుడుతుంది? చివరకు కొడుకు కోరికను తండ్రి ఎలా నేరవేర్చాడనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే..
స్టోరీ :
అంగవైకల్యంతో పేదరికంతో బాధపడుతున్న వీరయ్య (సముద్రఖని) కుమారుడు రాజు (మాస్టర్ ధృవన్). చిన్న వయసులోనే తల్లి మరణించడంతో వీరయ్య అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటాడు. వీరయ్యకు తోడుగా అదే కాలనీలో ఆటో నడుపుతూ డేనియల్ (ధనరాజ్), చెప్పులు కుట్టుకునే వృత్తిలో కోటి (రాహుల్ రామకృష్ణ) ఉంటారు. ఊహ తెలిసినప్పటి నుంచి వీరయ్య కుమారుడు రాజు విమానాలు అంటే ఇష్టమే కాకుండా దానిలో ప్రయాణించాలనే కోరిక ఉంటుంది. విమానం ఎక్కించమని తండ్రి వీరయ్యను ప్రతిరోజు కోరుతూనే ఉంటాడు.
విమానం ఎక్కాలని కోరిక ఎందుకు కలిగింది పేదరికంతో బాధపడి వీరయ్య తన కొడుకుని విమానం ఎక్కించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనే విషయమే ఈ సినిమా కథ. అదే కాలనీలో సుమతి (అనసూయ భరద్వాజ్) వేశ్యవృత్తిని కొనసాగిస్తూ ఉంటుంది. రాహుల్ రామకృష్ణ అనసూయని ప్రేమిస్తూ ఉంటాడు. అనసూయ ఆయన ప్రేమను అంగీకరించిందా విమానం ఎక్కాలని కోరికను వీరయ్య తీర్చాడా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే విమానం చూడాల్సిందే..
రివ్యూ :
తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాలే ప్రధానంగా సాగే చిత్రమిది. తన కొడుకు కోరికని తీర్చే క్రమంలో ఓ తండ్రి జీవితంలోని సంఘర్షణని హృదయాలకి హత్తుకునేలా తెరపైన ఆవిష్కరించారు దర్శకుడు. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే భావోద్వేగాలు.. అనేక పాత్రలు ఇందులో ఉంటాయి. అయితే కథని ఎక్కువగా వీరయ్య.. అతని కొడుకు చుట్టూనే తిప్పడంతో కథ ఓ చిన్న పార్శ్వానికే పరిమితమైనట్టు అనిపిస్తుంది. సినిమాలో మిగిలిన పాత్రల్ని పైపైనే తేల్చేయడంతో కథ, కథనా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించవు.
హైదరాబాద్ లో విమానాశ్రయం బేగంపేట్ నుంచి శంషాబాద్‌లోకి మారిన రోజులనాటి కథ ఇది. వీరయ్య.. అతని వ్యక్తిత్వం, బస్తీ జీవితాన్ని ఆవిష్కరిస్తూ సినిమా టేకాఫ్ అవుతుంది. అసలు కథలోకి వెళ్లడానికి సమయం తీసుకున్నాడు దర్శకుడు. అయితే రాజుకి విమానంపై ఉన్న ఇష్టంతో అతను వేసే ప్రశ్నలు, స్కూల్లో తన స్నేహితులతో కలిసి విమానం గురించి చెప్పుకొనే ముచ్చట్లు నవ్విస్తాయి. చిన్నారుల అమాయకత్వం నుంచి మంచి వినోదం పండుతుంది.
మరోవైపు కోటి, సుమతి పాత్రల హంగామా కాలక్షేపాన్నిస్తుంది. రాజు కలని తొందరగా నెరవేర్చాల్సి రావడం, అదే సమయంలోనే వీరయ్య జీవనాధారమైన మరుగుదొడ్డి కూల్చివేయడం నుంచే అసలు కథ మొదలవుతుంది. ద్వితీయార్ధంలో వీరయ్యకి ఎదురయ్యే కష్టాల్ని మరీ సినిమాటిక్ గా చూపించడం, మిగిలిన పాత్రలపై దృష్టిపెట్టకపోవడంతో కథ ఏ దిశగా వెళుతుందో ముందే అర్థమవుతుంది. కీలకమైన ఎగ్జిబిషన్‌లోని సన్నివేశాల్ని సాదాసీదాగా మలిచారు.
నటీనటులు ఎలా చేశారంటే..
తండ్రి పాత్రకు సముద్రఖని న్యాయం చేశారు. మాస్టర్ ధ్రువన్ నటనలో అమాయకత్వం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య భావోద్వేగభరిత సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వేశ్యగా మారిన సుమతి పాత్ర నుంచి సంఘర్షణ ఏమైనా ఉంటుందేమో అని ఆశించినా క్లైమాక్స్ వరకూ ఆ పాత్రపై దృష్టిపెట్టలేదు డైరెక్టర్ చివర్లో కోటి, సుమతి నేపథ్యంలో తీర్చిదిద్దిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ తమ పాత్రల్లో ఈజీగా నటించారు. మీరా జాస్మిన్ నటించడం వల్ల ఎయిర్ హోస్టెస్ పాత్రకు హుందాతనం వచ్చింది.
ప్లస్ పాయింట్స్ :
* సముద్రఖని నటన
* కథనం
* ఎమోషనల్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
* ఊహకు తగ్గట్టుగా సాగే కథ
* స్టార్ క్యాస్ట్ లేకపోవడం
రేటింగ్ : 2.75/5
ట్యాగ్ లైన్ : విమానం పర్ఫెక్ట్గా ల్యాండ్ అయ్యింది. క్లైమాక్స్ కి పేరెంట్స్ కనెక్ట్ అవుతయారు. విమానం ఒక ఎమోషనల్ జర్నీ..
Discussion about this post